కొవిడ్ కాలంలో నవంబర్ 30 వరకు ప్రజలకు ఉచితంగా రేషన్ అందించాలని గతంలో నిర్ణయించింది కేంద్రం. తాజాగా.. ఈ నెల 30 తర్వాత ఈ కార్యక్రమాన్ని పొడిగించేందుకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని ఆహార, ప్రజాపంపిణీ విభాగం కార్యదర్శి సుదర్శన్ పాండే వెల్లడించారు.
గతేడాది లాక్డౌన్ దృష్ట్యా గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా పేదలకు తొలుత 8 నెలలు ఉచిత రేషన్ అందించారు. 2020 ఏప్రిల్‌లో ఈ కార్యక్రమం మొదలైంది. కరోనా సెకండ్ వేవ్‌లో ఈ ఏడాది మే, జూన్ వరకు అమలు చేశారు. కరోనా పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడకుండా..జూన్‌లో మరో ఐదు నెలలు పొడిగించారు. దేశవ్యాప్తంగా ఎన్ఎఫ్ఎస్ఏ (జాతీయ ఆహార భద్రత చట్టం) కింద గుర్తింపు పొందిన రేషన్ కార్డుహోల్డర్లకు ఉచిత రేషన్‌ను అందిస్తోంది కేంద్రం. 80 కోట్ల మంది ఈ కార్యక్రమంతో లబ్ధి పొందినట్టు ప్రభుత్వం గతంలో వెల్లడించింది.
అలాగే ముడి పామ్ ఆయిల్, ముడి సోయాబీన్ ఆయిల్, ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై కనీస సుంకాన్ని 2.5శాతం నుంచి సున్నాకు తగ్గించినట్టు కేంద్రం వెల్లడించింది. ఏడాదిగా పెరుగుతున్న వంట నూనె ధరలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. క్రూడ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 5శాతం అగ్రీసెస్ను తగ్గించినట్టు పేర్కొంది.