సుకన్య సమృద్ధి యోజన స్కీమ్-రూ.1000 చెల్లిస్తే..రూ.5 లక్షలు..

0
88

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పొదుపు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ఒకటి సుకన్య సమృద్ధి యోజన. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే పొదుపు చేయాలంటే ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఆడపిల్లల పైచదువులు, పెళ్లిళ్ల కోసం డబ్బు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఎంచుకుంటూ ఉంటారు.

సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ను పోస్ట్ ఆఫీసులో లేదా బ్యాంకులో ఓపెన్ చేయొచ్చు. ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకొనే వెసులుబాటు కూడా ఉంది. ఈ స్కీమ్‌లో 15 ఏళ్ల పాటు పొదుపు చేయాలి. మెచ్యూరిటీ 21 ఏళ్లకు ఉంటుంది. కనీసం రూ.250 డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత ఏడాదికి రూ.250 నుంచి రూ.1,50,000 మధ్య జమ చేయొచ్చు. నెలకోసారి లేదా మొత్తం ఒకేసారి పొదుపు చేయొచ్చు. ఒకవేళ గడువులోగా డబ్బులు పొదుపు చేయకపోతే రూ.50 జరిమానా చెల్లించాలి. డిఫాల్ట్ అయిన అకౌంట్‌ను పునరుద్ధరించుకోవచ్చు.. అందుకోసం అదనంగా 50 రూపాయలు చెల్లించాలి..

ఈ పథకంలో జూలై నుంచి సెప్టెంబర్ కాలానికి 7.6 వడ్డీ రేటు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే సమయంలో వడ్డీ జమ అవుతుంది. జమ చేసిన మొత్తానికి, వడ్డీకి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపు పొందొచ్చు..మీకు పాప పుట్టగానే సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసి ప్రతీ నెలా రూ.1,000 చొప్పున జమ చేస్తే ఏడాదికి రూ.12,000 జమ చేయాల్సి ఉంటుంది. 15 ఏళ్లలో జమ చేసే మొత్తం రూ.1,80,000 అవుతుంది. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం చూస్తే మొత్తం రూ.3,47,445 వడ్డీ లభిస్తుంది. అమ్మాయికి 21 ఏళ్లు పూర్తైన తర్వాత అసలు + వడ్డీ కలిపి మొత్తం రూ.5,27,445 వరకూ మీ సొంతం చేసుకోవచ్చు..