విద్యుత్ బిల్లుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి..నిరసనలు తెలపాలని తమ్మినేని పిలుపు (వీడియో)

0
29

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ సంస్థ విద్యుత్‌ చార్జీలను గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్‌కు రూపాయి చొప్పున పెంచి విపరీతమైన భారాన్ని వేసింది. ఈ పెంచిన ఛార్జీలు ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి వస్తాయి. ఇంత భారీ మొత్తంలో వేసిన భారాలను వెంటనే పూర్తిగా ఉపసంహరించాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నదని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

డిస్కాంలు పెట్టిన పెంపుదల ప్రతిపాదనలను ఉన్నదున్నట్టు రెగ్యులేటరీ కమిషన్‌ ఉన్నదున్నట్టు ప్రకటించడమంటే ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించలేదని అర్థమవుతున్నది. గృహ వినియోగదారులైన 60లక్షల మందికి ప్రస్తుతం యూనిట్‌కు రు.1.45 పైసలు కాగా ప్రస్తుతం యూనిట్‌కు 50 పైసలు పెంచి రు.1.95 పైసలు అనగా 34 శాతం పెంచారు. పరిశ్రమలపైన ప్రస్తుతమున్న యూనిట్‌ ఛార్జీలపై రూపాయి పెంచింది. దీంతో ప్రస్తుత భారానికి 25 శాతం నుండి 30 శాతం వరకు పెంపుదల చేసారు. మొత్తం డిస్కాంలకు రావాల్సిన ఆదాయాన్ని 25 శాతం పెంపుదల చూపారు. టారీఫ్‌ రేట్ల బహిరంగ విచారణలో పాల్గొన్న అనేక మంది ఛార్జీలు పెంచవద్దని, భారాలను ప్రభుత్వమే సబ్సిడీగా భరించాలని శాస్త్రీయంగా వివరించారు.

గత నాలుగేళ్ళల్లో డిస్కాంలు రు.36 వేల కోట్ల అప్పులు చేసాయి. 2022-23 సంవత్సరానికి మరో 11వేల కోట్ల లోటును చూపించారు. కానీ రెగ్యులేటరీ కమిషన్‌ డిస్కాంలు చూపినదానికన్నా 2వేల కోట్ల భారాన్ని చూపడం అత్యంత దుర్మార్గం. డిస్కాంలు తమ అంతర్గత సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఛార్జీలను పెంచాల్సిన అవసరముండదు. కానీ డిస్కాంలు ఛార్జీల పెంపుపైనే దృష్టి పెట్టాయి. ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్ల నిర్వహణ చాలా లోపభూయిష్టంగా ఉండడంతో నష్టాలు పెరుగుతున్నాయి. మేనేజ్‌మెంట్‌ ఖర్చులను బాగా పెంచి ఈ నష్టాలను మరింత పెరగడానికి తోడ్పడుతున్నారు.

బహిరంగ మార్కెట్‌లో అతితక్కువకు లభ్యమవుతున్న విద్యుత్‌ను కొనకుండా, ఎక్కువ రేట్లకు వేలంలో పాడినవారి దగ్గర కొనుగోలు చేస్తున్నారు. ”ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ డిస్పాచ్‌” ప్రకారం ఎసెండింగ్‌ విధానంతో విద్యుత్‌ను వినియోగించినచో నష్టాలు తగ్గుతాయి. కానీ ఎసెండింగ్‌కు బదులు డిసెండింగ్‌ ఆర్డర్‌ను విద్యుత్‌ శాఖ అమలు చేస్తున్నది. ప్రభుత్వ విద్యుత్‌ జనరేషన్‌ కంపెనీల నుండి కాకుండా అధిక ధరలకు అమ్మే ప్రయివేటు జనరేషన్‌ కంపెనీల నుండి కొనుగోలు చేయడంతో ఛార్జీల భారాన్ని వినియోగదారులపై వేస్తున్నారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.facebook.com/alltimereport/videos/227956722856841

రాష్ట్ర అవసరాల మేరకు విద్యుత్‌ను కొనుగోలు చేసి వృధా ఖర్చును తగ్గించడం ద్వారా భారాలు పెంచకుండా విద్యుత్‌ను సరఫరా చేయవచ్చు. అందువల్ల పెంచిన విద్యుత్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని సీపీఐ(ఎం) పిలుపునిస్తున్నది.

(తమ్మినేని వీరభద్రం)
రాష్ట్ర కార్యదర్శి