తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన నేలపూడి స్టాలిన్‌బాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనని నియోజకవర్గస్థాయి సమావేశం బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఆయన పి.గన్నవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈ సమయంలో పార్టీ నుంచి పంపిన పార్టీ ఫండ్ ని దుర్వినియోగం చేశారు అని ఆరోపణలు ఉన్నాయి, ఈ సమయంలో నిన్న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది పార్టీ… ఇక పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన వ్యక్తినే ఆ పార్టీ కేడర్ బహిష్కరిస్తున్నట్టు తీర్మానించడం వెనువెంటనే జిల్లా అధ్యక్షుడు ఆ తీర్మానానికి ఆమోదముద్ర వేసి కార్యకర్తల పట్టుతో ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
అయితే ఇక్కడ కొసమెరుపు ఏమిటి అంటే, తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు 10వ తేదీన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ పంపినట్టు చెబుతున్నారు స్టాలిన్ బాబు. పార్టీ ఓటమి చెందినప్పటికీ పార్టీ అభ్యున్నతికోసం అహర్నిశలు కృషిచేస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. కొందరు కావాలనే తనని టార్గెట్ చేశారు అని అందులో ఆరోపించారు. అంబాజీపేటకు చెందిన నేలపూడి స్టాలిన్‌బాబు గతంలో అప్పటి టీడీపీ ఎంపీగా పనిచేసిన పండుల రవీంద్రబాబు దగ్గర పీఆర్‌వోగా పనిచేసేవారు. మొత్తానికి ఆయనపై ఇప్పుడు వేటు వేయడం అనేది పెద్ద చర్చనీయాంశమైంది. మరి ఇక్కడ బాధ్యతలు ఎవరికి ఇస్తారో చూడాలి.