ప్రముఖ జర్నలిస్టు, తెలంగాణ కలం గొంతుక తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రామచంద్రరావు, అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, నూనె బాలరాజ్ గౌడ్ తదితరుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మల్లన్నకు సభ్యత్వమిచ్చి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..తెలంగాణలో ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి బీజేపీలో చేరడం సంతోషంగా ఉంది. హ్రుదయపూర్వకంగా బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నాం. మల్లన్న నిఖార్సయిన తెలంగాణ వాది, ఉద్యమకారుడు.. రాజకీయ స్వార్థంతో మల్లన్న బీజేపీలో చేరడం లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతి రహితంగా ఉంటూ పేదల కోసం పాలిస్తుంటే..తెలంగాణలో అందుకు భిన్నంగా అవినీతి, రాక్షస, కుటుంబం పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి మల్లన్న.
మల్లన్న తన కలంతో గళమెత్తుతుంటే జీర్ణించుకోలేని సీఎం కేసీఆర్ పోలీసు కేసులతో అనేక కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే మల్లన్నపై కేసీఆర్ అనేక నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి వేధించారు. అయినా వెరవని మల్లన్న తాను ఎంచుకున్న దారిలో వెళుతూ అమరవీరుల ఆశయం కోసం పోరాడుతున్నారు. మల్లన్నపై పదేపదే కావాలని కేసీఆర్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించింది. మల్లన్నను చూసి మేం బాధపడ్డాం. మలన్నకు అండగా నిలబడ్డాం. తెలంగాణలోని దుర్మార్గమైన పాలనను అంతమొందించాలంటే అది బీజేపీతోనే సాధ్యమని తెలంగాణ ఉద్యమకారులు భావిస్తున్నారు. విఠల్, మల్లన్న వంటి నేతలకు రాజకీయ స్వార్థం లేదు. పోరాడే తెలంగాణ ఉద్యమకారులు, పోరాట పటిమ ఉన్న నేతలు. వారి లక్ష్యాలకు అనుగుణంగా బీజేపీ ఉద్యమిస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ కుటుంబ, అవినీతి, నియంత ప్రభుత్వాన్ని తరిమితరిమి కొడతాం. కేసీఆర్ రాక్షస పాలనకు చరమగీతం పాడతాం. తెలంగాణ ఉద్యమకారులకు వేదిక బీజేపీ. బీజేపీ చేపడుతున్న ఈ మహోద్యమానికి మద్దతు పలకాలని రాష్ట్రంలోని తెలంగాణ ఉద్యమకారులను కోరుతున్నా అన్నారు.