కేంద్రం లిఖితపూర్వక హామీ..రైతు సంఘాల కీలక నిర్ణయం

The Center has given a written guarantee..a key decision of the farmer associations

0
38

దిల్లీ: ఏడాదికి పైగా రైతులు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. నూతన సాగుచట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను నెరవేరుస్తూ ప్రభుత్వం ఇటీవల ఆ చట్టాలను రద్దు చేసింది.

కాగా మరికొన్ని డిమాండ్లను కూడా నెరవేర్చాలని రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో ఆయా డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తామని, ఆందోళన విరమించాలని రైతులను ప్రభుత్వం కోరుతోంది. ఈ నేపథ్యంలో రైతులు దిల్లీ సరిహద్దులను ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

రెండ్రోజుల్లో ధర్నా ప్రాంతాల్ని ఖాళీ చేసి వెళ్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రతినిధులు వెల్లడించారు. అయితే, డిమాండ్లు పూర్తిగా నెరవేర్చే వరకు ఆందోళనలను ఇతర రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో కొనసాగిస్తామని తెలిపారు. హామీల అమలుకు సంబంధించిన విషయాలు లిఖితపూర్వకంగా ఉండాలని డిమాండ్ చేశారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చట్టబద్ధతపై కమిటీ ఏర్పాటు చేస్తామని, అందులో రైతు సంఘాల నేతలు కూడా ఉంటారని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఆ తర్వాత రైతులపై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకుంటామని కేంద్రం మరో హామీ ఇచ్చింది. దీంతో ఆందోళనను విరమించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రైతులు దిల్లీ సరిహద్దుల్ని ఖాళీ చేయనున్నారు.