వ్యవసాయానికి మరింత ఊతమిచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు గానూ 2022–23 బడ్జెట్‌లో రుణ వితరణ లక్ష్యాన్ని రూ.18 లక్షల కోట్లకు కేంద్ర ప్రభుత్వం పెంచనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) సాగు రంగానికి రూ.16.5 లక్షల కోట్లు రుణాలు ఇవ్వాలంటూ (పంట రుణాలు సహా) బ్యాంకులకు కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది.
వ్యవసాయ రంగానికి సంబంధించి రుణ వితరణ లక్ష్యాన్ని ఏటా ప్రభుత్వం పెంచుతూనే వస్తోంది. దీన్ని తదుపరి ఆర్థిక సంవత్సరానికి మరింత పెంచొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జనవరి చివరి వారానికి కచ్చితమైన కేటాయింపులపై స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి. వాస్తవానికి ప్రభుత్వం పెట్టిన లక్ష్యానికి మించే రుణాలు సాగు రంగానికి మంజూరవుతున్నాయి. 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.10 లక్షల కోట్ల లక్ష్యాన్ని నిర్ధేశిస్తే.. వాస్తవ మంజూరు రూ.11.68 లక్షల కోట్లుగా నమోదైంది.
అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోనూ రూ.9 కోట్ల లక్ష్యం కాగా, ఇచ్చిన రుణాలు రూ.10.66 లక్షల కోట్లుగా ఉన్నాయి. రైతులు అధిక వడ్డీ రేట్లపై అసంఘటిత రంగం నుంచి రుణాలు తీసుకునే పరిస్థితిని తప్పించొచ్చు. పైగా రూ.3 లక్షల వరకు సాగు రుణంపై ప్రభుత్వం 2 శాతం వడ్డీ రాయితీని కూడా కల్పిస్తోంది. సకాలంలో రుణాలను చెల్లించిన వారికి మరో 3 శాతాన్ని ప్రోత్సాహకంగా ఇస్తోంది.