తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఏ రకంగా చూసినా రాష్ట్రం అప్పులు ఎఫ్.ఆర్.బి.ఎం. చట్ట పరిమితుల్లోనే ఉన్నాయి.
ఈ వాస్తవాన్ని గమనించకుండా బురదజల్లడమే లక్ష్యంగా కొంతమంది రాష్ట్ర అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోడు గుర్రాల మాదిరిగా ప్రగతిరథాన్ని నడిపించాలని రాజ్యాంగవేత్తలు కోరుకున్నారు. అందుకే సమాఖ్య స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ గద్దె మీద కూర్చొన్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తున్నది. కూచున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం పాల్పడుతున్నది. కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్ధంగా 41శాతం వాటా రాష్ట్రాలకు చెల్లించాలి.
కేంద్రం ఈ వాటాను కుదించాలనే దురుద్దేశంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల విధింపు రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటున్నది. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత, కేంద్రం ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు “ఉచితాలు” అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయం. కేంద్ర సర్కారు అసమర్థ నిర్వాకం వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ నానాటికి తీసికట్టు నాగంభొట్లు అన్న తీరుగా ఎన్నడూ లేనంతగా పడిపోయింది. దేశంలో నిరుద్యోగం తీవ్రతరమౌతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారు
తరతరాలుగా భారతదేశం నిలబెట్టుకుంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యంగ పదవుల్లో ఉన్నవారే నేడు ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దుర్మార్గాన్ని చూసి కచ్చితంగా స్వాతంత్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తాయి. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్నది. నేడు భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే వెకిలి మకిలి ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. మన రాష్ట్రంలోనూ మత చిచ్చురేపి రేపాలనీ, శాంతిని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయాలనీ, తద్వారా అభివృద్ధిని ఆటంకపరచాలనీ విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోని మేధావి లోకం, యువకులు, విద్యార్థులు, ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఈ శక్తుల కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.