రేవంత్ రెడ్డి సీరియస్ : ఉత్తమ్ తమ్ముడికి తాఖీదులు

0
38

రేవంత్ రెడ్డి కొత్త పిసిసి అయ్యాక కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కనబడుతున్నది. గతంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకులది ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉండేది. ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు… ఎవరు ఎవరినైనా కలవొచ్చు. రహస్యంగానే కాదు పబ్లిక్ గా కూడా కలుసుకోవచ్చు. పబ్లిక్ గానే అధికార పార్టీలు టిఆర్ఎస్, బిజెపి నేతలతో కలిసి వ్యాపారాలు నడపొచ్చు అన్నట్లుగా వ్యవహారం ఉండేది.

కానీ రేవంత్ రెడ్డి అలాంటి వాటికి అడ్డుకట్ట వేస్తున్నారు. నిన్నటికి నిన్న తన సన్నిహితుడే అయినా కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కు మనికం ఠాగూర్ చేత లీగల్ నోటీస్ ఇప్పించి షాక్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

తాజాగా మాజీ పిసిసి తమ్ముడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి బంధువైన (సోదరుడి వరుస) పాడి కౌషిక్ రెడ్డికి పిసిసి క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. పాడి కౌషిక్ రెడ్డి వ్యవహారం పట్ల పిసిిసి చీఫ్ రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన నాటినుంచి పాడి కౌషిక్ రెడ్డి టిఆర్ఎస్ తో టచ్ లో ఉన్నట్లు గుసగులు వినబడ్డాయి. ఒక అశుభకార్యంలో వీరిద్దరూ కలుసుకున్నారు. మాట్లాడుకున్నారు. పాడి కౌషిక్ రెడ్డి సొంత పార్టీ నాయకుడితో మాట్లాడినట్లే కేటిఆర్ తో ఎగబడి ఎగబడి మాట్లాడారు. అప్పటినుంచే కౌషిక్ రెడ్డి టిఆర్ఎస్ అండ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి.

ఈ తరుణంలో ఇవాళ పాడి కౌషిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అసలే టిఆర్ఎస్ బద్ద శత్రువు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయి ఉన్నాడు కాబట్టి ఇక ఎంత మాత్రం ఉపేక్షించినా పార్టీకి నష్టం అని ఆయన భావించినట్లు చెబుతున్నారు. అందుకోసమే పిసిసి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇదేదో టైంపాస్ షోకాజ్ నోటీసు కూడా కాదు. 24 గంటల్లోనే నోటీసుకు రిప్లై ఇవ్వాలని హెచ్చరించింది టిపిసిిస క్రమశిక్షణ సంఘం. ఇప్పుడు పాడి కౌషిక్ రెడ్డి వ్యవహారం టిపిసిసి మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరకాటాన్ని తెచ్చి పెట్టే పరిస్థితి ఏర్పడింది.

padi kaushik reddy, huzurabad congress leader

క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి కామెంట్స్..

హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి షో కాజ్ నోటీస్ జారీ చేసింది టీపీసీసీ క్రమశిక్షణ సంఘం.

పాడి కౌశిక్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ టిఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిర్యాదులు అందాయి.

గతంలోనే కౌశిక్ రెడ్డిని క్రమశిక్షణ సంఘం పిలిచి హెచ్చరించినా ఆయన వైఖరి మారలేదని గుర్తించాము.

24 గంటల్లోగా ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని నోటీస్ లో పేర్కొన్నది క్రమశిక్షణ సంఘం.

లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన క్రమశిక్షణ సంఘం.