తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచే స్థానాలు ఏమిటో చూడండి

తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచే స్థానాలు ఏమిటో చూడండి

0
67

2019 సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరకాలం కంటే తక్కువ సమయం ఉండటంతో అప్పుడే సర్వేల లొల్లి షురూ అయ్యింది. ప్రస్తుతం తాము ఏ పొజిషన్‌లో ఉన్నామో తెలుసుకునేందుకు ప్రధాన రాజకీయపార్టీలు సర్వే ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో గులాబీ బాస్ కేసీఆర్ ఓ సంస్థతో సర్వే చేయించినట్లు తెలుస్తోంది. కర్నాటక ఎన్నికలకు సంబంధించి సర్వే చేసిన ఆ సంస్థ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందంటూ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఎన్నికల తర్వాత పిక్చర్ తారుమారైంది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇదే సంస్థకు సర్వే బాధ్యతలు అప్పజెప్పిన కేసీఆర్‌కు తీపి కబురు చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ 100 అసెంబ్లీ సీట్లు గెలవడం ఖాయమన్న నివేదికను సీఎం కేసీఆర్ ముందుంచింది. అయితే కర్నాటక ఎన్నికల రిపోర్ట్‌ తప్పుల తడకగా ఉండటంతో గులాబీ దళపతి మరో సర్వే ఏజెన్సీకి కూడా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. సర్వే నిర్వహించిన ఈ కొత్త సంస్థ కూడా టీఆర్ఎస్‌కు 100 సీట్లు వస్తాయని తేల్చేసింది.

మరోవైపు పార్లమెంటు సీట్లలో 17 స్థానాలకు గాను 15 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని చెప్పిన సర్వే… హైదరాబాద్ సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాలు మాత్రం కోల్పోయే అవకాశముందని వెల్లడించింది. అయితే సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ బీజేపీల మధ్య గట్టి పోటీ ఉంటుందని సర్వే లెక్కలు కట్టింది. పాత సర్వే ఏజెన్సీ ఇచ్చిన నివేదిక కొత్త సర్వే ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ దాదాపు ఒక్కటిగానే ఉండటంతో టీఆర్ఎస్‌లో జోష్ పెరుగుతోంది. త్వరలోనే కేసీఆర్ ఈ సర్వే వివరాలను వెల్లడిస్తారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. సర్వేలెక్కలు, టీఆర్ఎస్ శ్రేణుల జోష్ చూస్తే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.