మేడారం మహాజాతరకు టీఎస్‌ఆర్టీసీ రెడీ..3845 ఆర్టీసీ బస్సులు సిద్ధం

TSRTC ready for Medaram Mahajatra..3845 RTC buses ready

0
131

తెలంగాణలోని అతి పెద్ద గిరిజన పండుగ మేడారం మహాజాతరకు టీఎస్‌ఆర్టీసీ రెడీ అవుతోంది. సుమారు 21 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో 3,845 బస్సులు నడపాలని నిర్ణయించారు. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం జాతర జరగనుంది.

ఒక్క వరంగల్‌ ఆర్టీసీ రీజియన్‌ నుంచే 2,250 బస్సులను నడిపేందుకు ఆమోదం లభించింది. ఈసారీ హైదరాబాద్‌ నుంచి ఏసీ బస్సులు నడవనున్నాయి. జాతర సమయంలో బస్సులను నిలిపేందుకు ఆర్టీసీ 50 ఎకరాల్లో భారీ బస్టాండును నిర్మిస్తోంది. స్థలాన్ని చదును చేసి టికెట్లకు క్యూ లైన్ల ఏర్పాటు పనులు బుధవారమే ప్రారంభమయ్యాయి. మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఈసారి ప్రసాదం, పసుపు, కుంకుమలను పంపిణీ చేయాలనుకుంటున్నట్లు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి తెలిపారు.

అమ్మవార్లకు భక్తులు మొక్కుగా గద్దెలపై సమర్పించే బంగారం(బెల్లం), పసుపు, కుంకుమలను భక్తులు ఇంటికి తీసుకెళ్తారు. రద్దీలో కొద్ది మందికే ఇది సాధ్యమవుతోంది. ప్రసాదం కోసం భక్తులు గద్దెల వద్ద వేచి చూడటంతో దర్శనానికి వచ్చే ఇతర భక్తులకు ఆలస్యమవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 2022 ఫిబ్రవరిలో జరిగే జాతరలో మొక్కులు చెల్లించిన భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేసే ఆలోచన ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.