తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇప్పటికే అనేక సార్లు బస్సు చార్జీలు పెంచగా..తాజాగా లగేజీ ఛార్జీలు పెంచుతూ టీఎస్‌ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కొత్త ఛార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
‘లగేజీ ఛార్జీలు సుదీర్ఘకాలంగా ఒకేలా ఉన్న అంశంపై ఇటీవల జరిగిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో చర్చ జరిగిన నేపథ్యంలో వాటిని పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. 2002 తర్వాత ఈ ఛార్జీలను పెంచిన దాఖలాలు లేవు. డీజిల్ ధరలతో పాటు మానవ వనరుల వ్యయాలు పెరగటంతో వాటినీ పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ కార్గో సేవలను ప్రోత్సహించేందుకు ఆ ఛార్జీలతో సమానంగా లగేజీ ఛార్జీలను పెంచాం’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో ట్రక్కు టైర్లు తరలించాలంటే ఇకపై 3యూనిట్లుగా పరిగణించి ఛార్జీలు వసూలుచేస్తారు. టీవీ, ఫ్రిజ్, సైకిల్, ఫిలింబాక్సులు, వాషింగ్ మెషీన్, కార్ టైర్లను రెండు యూనిట్లుగా, రేడియో, ఖాళీ బ్యాటరీ, టేబుల్ ఫ్యాన్, 25 లీటర్ల ఖాళీక్యాన్, కంప్యూటర్ మానిటర్, సీపీయూ, హార్మోనియంలను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు.