తెలంగాణ నిరుద్యోగులు అలర్ట్..OTR లో సవరణలకు TSPSC అవకాశం

0
39

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలు కానుంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆరే ఉద్యోగాల ప్రకటన చేశారు. దీనితో ఒకేసారి 80,039 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలోని అన్ని శాఖ‌ల‌లో ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాల‌ను సైతం విడుద‌ల చేశారు. దీనిలో భాగంగా తొలి విడతలో 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీంతోపాటు టెట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిరోద్యోగుల కోసం ప్రవేశపెట్టిన వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (OTR) లో మార్పులు చేసుకునేందుకు టీఎస్‌పీఎస్పీ అవకాశం కల్పిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం.. 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీ జోన్లకు అనుగుణంగా అభ్యర్థులు మార్పులు చేసుకోవాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది.

ఉద్యోగార్థులు తమ స్థానికతతో పాటు అదనపు విద్యార్హతలు కూడా ఓటీఆర్‌లో నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతోపాటు కొత్త అభ్యర్థులు కూడా ఓటీఆర్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనను విడుదల చేసింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓటీఆర్‌ వెబ్‌సైట్ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. టీఎఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ www.tspsc.gov.in ను సంప్రదించి ఎడిట్‌ (One Time Registration) ఆప్షన్‌ ద్వారా మార్పులు, చేర్పులు చేసుకోవచ్చంటూ టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది.