ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం హయంలో జరిగిన అవినీతి అక్రమాలకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందన్నారు. ముఖ్యంగా పోలవరం కాంట్రాక్ట్ పనుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. కాంట్రాక్టు పనుల నుంచి నవయుగ సంస్థను తప్పించాలని నిర్ణయించిందన్నారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అంటూ అక్కడ..ఇక్కడా శిలా ఫలకాలు వేయడమే సరిపోయిందని..సరైన రీతిలో పనులు సాగించలేదని అన్నారు.
ఈ క్రమంలో నిర్మాణ పనుల నుంచి వైదొలగాలని నవయుగ సంస్థకు ఇరిగేషన్ శాఖ నోటీసులు జారీ చేసింది. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రీ క్లోజర్ నోటీసులు జారీ చేసింది ఇరిగేషన్ శాఖ. కాగా, 60 సీ నిబంధన ప్రకారం 2018 ఫిబ్రవరిలో నవయుగ సంస్థకు హెడ్‌వర్క్స్ పనులు అప్పగించారు. రూ.3వేల కోట్ల విలువైన పనులు నవయుగకు అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.3220 కోట్ల జలవిద్యుత్ టెండర్లను కూడా నవయుగ దక్కించుకుంది. జలవిద్యుత్ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకోవాలని నవయుగకు సూచించింది ఇరిగేషన్ శాఖ.