ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్ష నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీలో నూతన జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి స్పందించారు. కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నానని ఈ నిర్ణయంతో ముఖమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలచనలో కొంత మార్పు కనబడుతుందన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ..2014లో రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు ఉండేవి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం 1974లోని నిబంధనల ప్రకారం, మొత్తం జిల్లాల సంఖ్యను 26కి తీసుకొని 13 కొత్త జిల్లాలను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదించింది. మెరుగైన పరిపాలన, దానిలో ఉన్న ప్రాంతాల అభివృద్ధి ప్రయోజనాల కోసం జిల్లాల ప్రాంతాలు లేదా సరిహద్దుల మార్పుకు వీలు కల్పించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించబడింది.
కొత్త జిల్లాల మధ్య అసెంబ్లీ స్థానాల సంఖ్య, ఇతర అంశాల పరంగా కొంత కొంత సమానత్వం ఉండేలా సహేతుకమైన కసరత్తు జరిగిందని నేను భావిస్తున్నాను. భౌగోళిక ప్రాంతాలు, జనాభాకు కూడా వెయిటేజీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను. విజయవాడ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టె ప్రతిపాదన చేయడంతో కులతత్వ రాజకీయాలను గట్టిగా ప్రోత్సహించిన వైస్సార్సీపీ మరియు ముఖమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలచనలో కొంత మార్పు కనబడుతుంది.
పుట్టపర్తిని కేంద్రంగా కొత్త శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయడం కూడా చాలా స్వాగతించదగినది. తెలంగాణలో జిల్లాల సంఖ్యను కూడా సీఎం కేసీఆర్ 2016లో 10 నుంచి 31కి, చివరకు 33కి పెంచారు. ఏపీలో ప్రతిపాదించిన దానికి భిన్నంగా తెలంగాణలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా సీఎం కెసిఆర్ కేవలం తన ఇష్టారాజ్యంగా చేసారు. ఫలితంగా జిల్లాల మధ్య చాలా అసమానతలు ఉన్నాయి, వాటిలో కొన్ని మెరుగైన పరిపాలన మరియు అభివృద్ధి అనే ప్రాథమిక లక్ష్యం నెరవేరకుండా చాలా అధ్వాన్నంగా మారాయి. చిన్న జిల్లాలతో రాజకీయ నాయకత్వాన్ని బలహీనపరచడం, వారి ప్రభావాన్ని తగ్గించడం ప్రధానలక్ష్యంగా ఉన్నట్లు స్పష్టంగా కనబడింది.
గతంలో 1980లో డాక్టర్ మర్రి చేన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసారు. కర్నూలు మరియు గుంటూరు జిల్లాల నుండి కొంత విస్తీర్ణాన్ని కలుపుకొని ప్రకాశం జిల్లాని, విశాఖపట్నం మరియు శ్రీకాకుళం జిల్లాల నుండి కొంత విస్తీర్ణాన్ని కలుపుకొని విజయనగరం జిల్లాని ఏర్పాటు చేసారు. మరియు అప్పుడున్న హైదరాబాద్ జిల్లా లో హైదరాబాద్ పట్టణం చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాన్ని రంగారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేశారన్నారు.