రేవంత్ రెడ్డి ఆ పెద్ద లీడర్ మొహమే చూస్తలేడు ఎందుకో?

0
201

టిపిసిసి చీఫ్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి మాంచి జోష్ మీదున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పటికీ కాకలు తీరిన సీనియర్లు ఉన్న పార్టీగా ముద్ర ఉంది. ఎంతోమంది నేతలు పక్క పార్టీలకు వలస వెళ్లినా కూడా అక్కడో ఇక్కడో సీనియర్లు బాగానే ఉన్నారు. దీంతో వారందరినీ వరుసబెట్టి కలుస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. కొందంటే ఇష్టం ఉన్నా లేకపోయినా పూలబొకేలు పట్టుకుని పోయి కలిసి మాట కలుపుతున్నారు. ఇక రేవంత్ ఈ పనిలో ఉంటే ఆయన అభిమానులు పెద్దసంఖ్యలో ఆయనను కలిసేందుకు ఎగబడుతున్నారు. ఫొటోలు దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ… ఒక లీడర్ ను మాత్రం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కలవలేదు. ఎందుకు? ఏం కథ అన్నది తేలలేదు. ఇంతకూ ఎవరా లీడర్ అనేగా మీ డౌట్? చదవండి మరి.

రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఎంపికైనట్లు ప్రకటన రాగానే తొలుత పెద్దలు జానారెడ్డిని కలిసి ఆశిస్సులు అందుకున్నారు. తర్వాత షబ్బీర్ అలీని ఇంటికెళ్లి కలిశారు. ఆ తర్వాత మాజీ పిసిసి చీఫ్ లు వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్యను కలుసుకున్నారు. విహెచ్ అయితే ఆసుపత్రిలో ఉంటే వెళ్లి కలిసి పరామర్శించారు. కానీ పిసిసి ప్రకటన రాకముందు రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి విహెచ్. ఓపెన్ గానే రేవంత్ కు వ్యతిరకంగా గళం విప్పిన నాయకుడు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన మనిషికి పిసిసి ఇస్తరా? అని నిలదీశారు. అంతేకాదు ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రేవంత్ కు ఎలా పిసిసి అన్నాడు. పెద్ద రెడ్లకు పిసిసి ఇయ్యాలన్నాడు. అంతేకాదు అధిష్టానానికి లేఖలు రాశారు. ఇంత చేసినా సరే రేవంత్ రెడ్డి మాత్రం ఆసుపత్రికి వెళ్లి మరి విహెచ్ ను పరామర్శించడం పట్ల ఇద్దరి మధ్య సంబంధాలు మెరుగుపడ్డ వాతావరణం ఉంది.

uttam kumar reddy

ఇకపోతే మాజీ మంత్రులు కొండా సురేఖ, నాగం జనార్దన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ఇలా తనకంటే పెద్ద లీడర్ అనుకున్నవారందరినీ కలుసుకున్నారు రేవంత్. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కూడా కలవాలనుకున్నారు. అయితే కోమటిరెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నన్ను కలవనే కలవొద్దు.. నా ఇంటికే రావొద్దు అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆయన దగ్గరకు ఇప్పటివరకైతే రేవంత్ రెడ్డి పోలేదు.

ప్రస్తుత పిసిసి అధ్యక్షులు, నల్లగొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాత్రం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కలవలేదు. అసలు ఏమైంది వీరిద్దరి మధ్య అనేది క్యేడరర్ లోనూ అయోమయం నెలకొంది. రేవంత్ రెడ్డే ఆయనను కలిసేందుకు వెళ్లలేదా? లేదంటే రేవంత్ వెళ్లే ప్రయత్నం చేసినా… కోమటిరెడ్డి లాగా ఉత్తమ్ కలవడానికి అయిష్టత చూపారా అన్నది తేలాల్సి ఉంది.

ఇద్దరి మధ్య వైరముందా?

రేవంత్ రెడ్డికి, పిసిసి చీఫ్ ఉత్తమ్ కు పడదా అన్న అనుమానాలు కేడర్ లో కలుగుతున్నాయి. ఒకప్పుడు రేవంత్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డే కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ తో, మైహోం రామేశ్వరరావుతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడని పలుమార్లు రేవంత్ రెడ్డి శిబిరం విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డికి పిసిసి రాకుండా ఉత్తమ్ కూడా ఏమైనా ప్రయత్నాలు చేశారా అనే అనుమానాలు సైతం కలుగుతున్నాయి.

ఏది ఏమైనా వీరిద్దరూ ఎడమొహం పెడమొంగా ఎందుకున్నరో కేడర్ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఇద్దరూ కలిసి వేదికను పంచుకున్న దాఖలాలు కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.