మ‌తాల పేరిట కొట్టుకోమ‌ని ఏ దేవుడు చెప్పాడు..మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

0
38
KTR

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రూపొందించిన స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఎవరి అమ్మ గొప్ప, ఎవరి దేవుడు గొప్పవాడు అన్న ప్రశ్నకు ఎప్పటికీ సమాధానం దొరకదన్నారు కేటీఆర్. తన పేరు మీద కొట్టుకు చావమని ఏ దేవుడు ఉపదేశించాడో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. ఎవరి దేవుడు గొప్పవాడో తేల్చుకునే పోటీలో తెలంగాణ ప్రజలు ఎన్నడూ ఉండరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా ఇండియా ఇంకా పేద దేశమే అన్నారు. 1987 లో చైనా, ఇండియా ఆర్థిక వ్యవస్థ పరిణామాలు ఒకేలా ఉండేవన్నారు. ఇవాళ చైనా ఆర్థిక వ్యవస్థ 16 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటే మనం మాత్రం ఇంకా కుల,మతాల గొడవలతో కొట్టుకు చస్తున్నామని చెప్పారు. దేశ ప్రజలు ఏం తినాలి? ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఎలా ఆలోచించాలో నిర్దేశిస్తున్న నియంతృత్వ ప్రభుత్వం కేంద్రంలో ఉందని విమర్శించారు.పెరుగుతున్న ధరలు, పడిపోతున్న జీవన ప్రమాణాల గురించి ప్రశ్నించొద్దనే హలాల్, హిజాబ్, అజాన్ ల పేరుతో ప్రజల మధ్య మతాల మంటల్ని బీజేపీ నేతలు ఎగదోస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

దేశ రాష్ట్రపతి స్వగ్రామానికి నిన్నటిదాక కరెంటు కూడా లేని దీనస్థితిలో భారతదేశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. కాని తెలంగాణ మాత్రం ఇందుకు భిన్నంగా పనిచేస్తోందన్నారు. స్వరాష్ట్రంగా ఏర్పడిన 8 ఏళ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అద్భుతాలను సాధిస్తోందని చెప్పారు. 2014 లో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం (GSDP) ఐదు లక్షల ఆరువేల కోట్ల రూపాయలుంటే ఇవాళ 11 లక్షల 55 వేల కోట్ల రూపాయలకు చేరిందన్నారు. కరోనా, నోట్ల రద్దు, జీఎస్టీ, కేంద్ర ప్రభుత్వ వివక్ష, కుట్రలను అధిగమించి ఈ వృద్ధిని సాధించామన్నారు. 2014 లో తెలంగాణ తలసరి ఆదాయం1,24,000 రూపాయలయితే ఇవాళ 2,78,000 రూపాయలన్నారు. భారత సగటు తలసరి ఆదాయం 1,49,000 రూపాయలు మాత్రమే అన్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ లెక్కలే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయత్వంలో ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ చెడిపోయిందో? అభివృద్ధి చెందిందో ప్రజలే తేల్చుకోవాలని చెప్పారు. స్వరాష్ట్రంగా తెలంగాణ మనగలుగుతుందా లేదా అన్న అనుమానాలు ఎప్పటినుంచో ఉన్నాయన్న కేటీఆర్, 1956 లో బలవంతంగా ఆంధ్రాతో కలిపిన నాడు కూడా తెలంగాణ మిగులు రాష్ట్రం అన్న సంగతిని కుమార్ లలిత్ కమిటీ తేల్చిందని గుర్తుచేశారు. తెలంగాణ ఆర్థికంగా నిలదొక్కుకుంటుందో లేదో అని 1968 ఉద్యమం ప్రారంభంలో..2001 లో కేసీఆర్ గారు ఉద్యమాన్ని మొదలుపెట్టిన సందర్భంలోనూ కొంతమంది అనుమానాలను వ్యక్తం చేస్తే, అవన్నీ ఉత్తవే అని బీపీఆర్ విఠల్ తేల్చేశారని చెప్పారు.

నాడైనా, నేడైనా, ఎన్నటికైనా తెలంగాణ మిగులు రాష్ట్రమే అని కేటీఆర్ అన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ ఆ నిధులను ప్రజాసంక్షేమం కోసమే ఉపయోగిస్తోందని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ఇంటింటికి నల్లాతో సురక్షిత తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు.సురక్షిత తాగునీటిని హక్కుగా అందిస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్నారు.ఇంటింటికి తాగునీరు ఇవ్వడం ఈజీ అయితే తమకంటే ముందున్న ప్రభుత్వాలు కాని, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కాని ఎందుకు ఇవ్వడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ వచ్చినంకనే మిషన్ భగీరథ స్టార్ట్ అయ్యాకనే నల్లగొండ ఫ్లోరైడ్ గోస తీరిందన్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్ లో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావతే చెప్పారని, అయితే సంకుచిత రాజకీయాల కోసం మాత్రం ఇక్కడ తమ ప్రభుత్వాన్ని బీజేపీ విమర్శిస్తోందని కేటీఆర్ చెప్పారు.

ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందన్నారు కేటీఆర్. త్రిగోర్జెస్ డ్యాం ను చైనా కడితే వాహ్వా అన్నవాళ్లే, కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కట్టించిండన్న ఒకే ఒక్క కారణంతో రంధ్రాన్వేషణ చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ తో పాటు కొన్ని జిల్లాలకు రాబోయే శతాబ్దం వరకు తాగునీటి అవసరాలు తీర్చే కామధేనువు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పారు. రాబోయే తరాలు ఈ విషయాన్ని ఒప్పుకుంటాయన్నారు. పాలమూరు రంగారెడ్డి , సీతారామా ప్రాజెక్టులతో తెలంగాణ రూపురేఖలు మారుతాయన్నారు. మన నిధుల్ని మనం ఇక్కడే ఖర్చు చేసుకున్నం కాబట్టే ఇది సాధ్యం అయింది. ఇప్పటివరకు ప్రభుత్వరంగంలో రెండు లక్షల 20 వేల పైచిలుకు ఉద్యోగాలు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని కేటీఆర్ చెప్పారు.

ఎన్నో ప్రతిబంధకాలను అధిగమించి 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా కొత్త జోనల్ సిస్టం ను కూడా తీసుకొచ్చామన్నారు. ప్రతీ ఒక్క వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదన్న కేటీఆర్, పెట్టుబడులు ఆకర్షించి ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టులను భర్తీ చేయకుండా బీజేపీ నేతలు తమను విమర్శించడం అవివేకం అన్నారు. తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాల అంతిమ లక్ష్యాన్ని సాధించామన్నారు ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు. రానున్న రోజుల్లో విద్యా,వైద్యరంగంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామన్నారు. 8 ఏళ్లలో ఒక్క కొత్త విద్యాసంస్థను కూడా ఇవ్వని దుర్మార్గమైన ప్రభుత్వం మోడీదే అని కేటీఆర్ ఆరోపించారు.

ధనవంతులు ఇవాళ ప్రశాంతంగా బతకుతున్నారంటే అందుకు పేదలు సామాజిక,ఆర్థిక భద్రతతో బతకడమే కారణమని కేటీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, రాజనీతిజ్ఞతతో సంపదను పెంచి పేదలకు పంచుతున్నామని చెప్పారు. అన్నం లేక వైద్యం లేక ఎవరైనా చనిపోతే ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. పేదవారికి సామాజిక, ఆర్థిక భద్రత కల్పించి పొట్టకు, బట్టకు కష్టం లేకుండా చూస్తున్నామన్నారు. ఏనాడు పేదల కష్టాలను చూడని వారు ఇవాళ ఉచితాలు మంచివి కావని నీతి సూత్రాలు చెపుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కార్పోరేట్లకు 12 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన మోడీ సర్కార్, పేదలకు పెన్షన్లు ఇవ్వొద్దు అంటోందని విమర్శించారు. పేదల కడుపు కొట్టి పెద్దలకు పంచే మోడీ సర్కార్ ఆర్థిక విధానాలతో రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఏర్పడుతాయన్నారు.

973 గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న కేటీఆర్, 5 లక్షల మంది పిల్లల చదవుల కోసం సంవత్సరానికి 6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఈ ఎనిమిదేళ్లలో 20 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్నీ ఇచ్చినమని తెలిపారు. ఇవేకాకుండా
మహాత్మాపూలే, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ ల పేరుతో 20 లక్షల రూపాయలను అర్హులైన విద్యార్థుల విదేశీ విద్య కోసం అందిస్తున్నామన్నారు. ఉన్నతవిద్య కోసం రాబోయే రోజుల్లో మరింత ఖర్చు చేస్తామన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను టీ హబ్ తో కనెక్ట్ చేసి కొత్త ఆవిష్కరణలకు మార్గం వేస్తామన్నారు.

వర్తమాన రాజకీయాలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతరణ, భారత రాజ్యాంగం పట్ల అందరికి అవగాహన కల్పించాలన్నారు. ఇక స్టడీ మెటీరియల్ హార్డ్ కాపీలతో పాటు సాఫ్ట్ కాపీలుగా కూడా అందుబాటులో ఉంచాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 2700 పేజీల మెటీరియల్ ను డీజిటలైజ్ చేసేందుకు తన శాఖ నుంచి సహకారం అందిస్తామన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోసం స్టేట్ డాటా సెంటర్ లో కొంత స్పేస్ కల్పిస్తామన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోసం 11 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన సుధీర్ రెడ్డికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.