రేవంత్ రెడ్డికి పిసిసి అనగానే కాంగ్రెస్ లో బుసలు

new tpcc chief tpcc new chief telangana new pcc chief revanth reddy new pcc chief

0
109

తెలంగాణలో పిసిసి అధ్యక్ష పదవిని కొత్త వారికి ఇవ్వకుండా కాంగ్రెస్ అధిష్టానం ఇంకా నాన్చివేత ధోరణినే కొనసాగిస్తున్నది. దుబ్బాక, జిహెచ్ఎంసి, నాగార్జున సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓటమిపాలైన తర్వాత పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడిని నియమించాలంటూ  అధిష్టానానికి సూచించారు. కానీ కొత్త అధ్యక్షుడి ఎంపికలో అధిష్టానం మీనమేషాలు లెక్కపెడుతూ కాలమెల్లదీస్తున్నది. దీంతో కేడర్ నిరుత్సాహానికి గురవుతున్నారు.

నిజానికి సుమారు ఏడాదిన్నర కాలంగా పిసిసి చీఫ్ ను మార్చాలని, ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ సర్కారు మీద స్ట్రాంగ్ గా పోరాటం చేయలేదని చాలామంది నేతలు అధిష్టానాన్ని కోరారు. ఇంకా కొందరైతే… ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ తో అండర్ స్ట్రాండింగ్ తో ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఉత్తమ్ గురించి తెలిసిన అధిష్టానం టిఆర్ఎస్ తో కుమ్మక్కు అనే ఆరోపణలను లైట్ తీసుకుంది. కానీ ఉత్తమ్ నే కొనసాగిస్తున్నది. ఒకవైపు పార్టీ నేతలు ఉత్తమ్ ను మార్చాలని కోరుతుండగా మరోవైపు తానే స్వయంగా తప్పుకుంటానని లేఖ ఇచ్చిన తర్వాత కూడా అధిష్టానం తాత్సారం చేయడంలో మతలబేంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు.

రెండు రోజుల క్రితం ‘‘పీసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం… అధిష్టానం నిర్ణయం… వెంటనే అనౌన్స్ మెంట్’’ అంటూ ఒక తెలుగు మీడియా ఛానెల్ లో కొద్దిసేపు ఒక బ్రేకింగ్ నడిచింది. వారికి ఏం సోర్స్ ఉందో కానీ… ఈ వార్త రాగానే కాంగ్రెస్ సీనియర్లలో కలవరం రేగింది. వెంటనే అధిష్టానాన్ని ఆరా తీశారు. అంతేకాదు… రేవంత్ రెడ్డికి ఇస్తే బాగుందంటూ కొందరు సీనియర్లు అధిష్టానం వద్ద మరోసారి తమ వైఖరిని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఆ తెలుగు మీడియా ఛానెల్ లో వచ్చిన న్యూస్ రేవంత్ రెడ్డే రాయించారని కొందరు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారని, వెంటనే రేవంత్ ను దానిపై వివరణ అడిగారని కూడా ప్రచారం సాగుతున్నది. రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ అనగానే కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ సీనియర్లు బుసలు కొడుతున్నారని.. సీనియర్ల మాట వింటే కాంగ్రెస్ మరింత కూరుకుపోక తప్పదని రేవంత్ సన్నిహితుడొకరు వ్యాఖ్యానించారు. ‘‘కొంత మంది ముసలోల్లు టిఆర్ఎస్ తో కుమ్మక్కై రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ రాకుండా అడ్డుకుంటూ కాంగ్రెస్ ను నాశనం చేస్తున్నారు’’ అని ఆయన ఒకింత ఘాటుగానే పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి పిసిసి ఇస్తే సీనియర్లు పార్టీ మారుతారన్న ప్రచారంపై స్పందిస్తూ… ఆ మాట అంటున్న సీనియర్లంతా టిఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారని ఆరోపించారు.

నిజానికి కాంగ్రెస్ లో చిత్రవిచిత్రమైన పరిస్థితి ఉంది. ఒకవైపు అధిష్టానం సాగదీత, మరోవైపు టిఆర్ఎస్ తో టచ్ లో ఉన్న పెద్దల కారణంగా కొత్త పిసిసి చీఫ్ ఎంపిక అనేది వాయిదా పడుతూ వస్తున్నది. అయితే అయింది పోతే పోయింది… అన్నట్లు అధిష్టానం కొత్త నేతను ఎంపిక చేస్తే అన్నీ సర్దుకుంటాయని నల్లగొండ జిల్లాకు చెందిన నేత ఒకరు వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి పిసిసి ఇస్తే పార్టీలో జోష్ పెరుగుతుందని, కొత్త తరం నాయకత్వ బాధ్యతల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక రేవంత్ రెడ్డికి పిసిసి అనగానే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. తాను కూడ పిసిసి రేస్ లో ఉన్నానని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. అంతేకాదు తనకు కానీ, తనకు ఇష్టమైన వారికి కానీ పిసిసి ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు. తనకు ఇష్టమైన వారికి పిసిసి ఇస్తే రాష్ట్రమంతా పర్యటిస్తారనని, తనకు నచ్చని వారికి ఇస్తే మాత్రం నియోజకవర్గానికే పరిమితమవుతానని అన్నారు. తనకు ఇష్టమైన వారి జాబితాలో రేవంత్ రెడ్డి లేడని అర్థం వచ్చేలా జగ్గారెడ్డి మాట్లాడారు.

మొత్తానికి అధిష్టానం పిసిసి చీఫ్ నే తేల్చుకోలేపోతే ఈలోగా టిఆర్ఎస్ కు బిజెపి ప్రత్యామ్నాయం అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కాంగ్రెస్ కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు.