యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు తిరిగి సంపాదించుకున్నది అలనాటి సతీసావిత్రి. అడవి బాట పట్టి మావోయిస్టుల చెర నుంచి తన భర్తను రక్షించుకుంది ఈ ఇంజనీర్ అజయ్ భార్య అర్పిత.
అసలు విషయం ఏంటంటే..పసిబిడ్డను ఎత్తుకొని అడవిలోకి వెళ్లిన ఆమె పోరాటం ఫలించింది. చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు కిడ్నాప్ చేసిన PMGSY సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రాకు విముక్తి లభించింది. బీజాపూర్‌లో ప్రజాకోర్టు నిర్వహించిన తరువాత ఇంజనీర్‌ను విడుదల చేశారు మావోయిస్టులు.
తన భర్తను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లారు అజయ్ రోషన్ భార్య అర్పిత. వారం రోజుల పాటు అర్పిత చేసిన పోరాటానికి తగిన ఫలితం దక్కింది. అర్పిత చేసిన పోరాటం మావోయిస్టుల హృదయాలను కదిలించింది. అర్పిత పోరాటానికి స్పందించిన మావోయిస్టులు సబ్ ఇంజనీర్ అజయ్ రోషన్‌ను విడుదల చేశారు.
వారం రోజుల పాటు మావోయిస్టుల చెరలోనే ఉన్నారు అజయ్ రోషన్. సామాజిక వేత్తలు, భార్య అర్పిత విజ్ఞప్తిని మన్నించి అజయ్ రోషన్ ను విడుదల చేశారు మావోయిస్టులు. బీజాపూర్ జిల్లా మాన్ కేళి,ఘడ్ గోర్ణ రోడ్డు నిర్మాణ పనులను గత గురువారం పరిశీలించడానికి వెళ్ళినప్పుడు సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్‌తో పాటు అటెండర్ ను కిడ్నాప్ చేశారు మావోయిస్టులు.
అయితే శుక్రవారం అటెండర్ లక్ష్మణ్ ను విడిచిపెట్టిన మావోయిస్టులు అజయ్‌రోషన్‌ను మాత్రం వారం రోజుల పాటు తమ దగ్గరే ఉంచుకున్నారు. చివరకు ఆయన కిడ్నాప్ వ్యవహారం సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.