అవినీతి సబ్ రిజిస్ట్రార్ పై వేటు

0
127

సందు దొరికితే చాలు ఎక్కడ అక్రమాలు చేద్దామా.. ఎక్కడ అవినీతి చేద్దామా అని కొందరు అధికారులు తయార్ ఉంటరు. అడ్డగోలుగా సంపాదించాలని కంకణం కట్టుకుంటరు. వారి అక్రమ సంపాదన కోసం ప్రభుత్వానికైనా టోకరా వేస్తరు లేదంటే మందిని అయినా పీల్చుక తింటరు. అసోంటి అధికారి కథే ఇది. ఇలా అవినీతి చేస్తూ అడ్డంగా బుక్ అయి సస్పెండ్ అయిన అవినీతి అధికారి బాగోతం రియల్ ఎస్టేట్ టివి ప్రేక్షకుల కోసం అందిస్తున్నాము.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అంటేనే అవినీతికి నిలయంగా మారింది. ఈ శాఖలో పనిచేసే అధికారులకు కనకవర్షం కురుస్తుందని అందరూ చెప్పుకునేమాట. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ గా పని చేస్తున్న శ్రీరామరాజును ఇటీవల సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సదరు రామరాజు గతంలో నిర్మల్ జిల్లాలోని బైంసా పట్టణంలో సబ్ రిజిస్ట్రార్ గా పని చేశారు. ఆ సమయంలో అక్రమ లేఅవుట్స్ కు రిజిస్ట్రేషన్లు చేయడంతోపాటు ఇల్లిగల్ గా భూములకు రిజిస్ట్రేషన్ చేయడానికి అక్రమార్కులకు సహకరించారని ఆరోపణలున్నాయి.
దీనిపై లోతుగా విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఈయన అవినీతిపై నివేదిక అందగానే రామరాజును సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ వరంగల్ డిఐజి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా సదరు రామరాజు రెండు నెలల క్రితమే నిర్మల్ జిల్లా నుండి ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ గా బదిలీ అయ్యారు. పాత వాసన పోనిచ్చుకోక ఆదిలాబాద్ జిల్లాలోనూ ఆయన పలు అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకారం అందించారన్న ఆరోపణలున్నాయి. మొత్తానికి అక్రమార్కులను ఆఫీసు మెట్లెక్కనీయకుండా పనిచేయాల్సిన సబ్ రిజిస్ట్రార్ తుదకు వారితో అంటకాగి ఉద్యోగం పోగొట్టుకుని నడిబజారులో పరువు పోగొట్టుకున్నాడు. Real Estate Tv అనే యూట్యూబ్ ఛానెల్ లో దీనికి సంబంధించిన వీడియో ఉంది చూడొచ్చు. లింక్ పైన ఉంది.