గ్రామం కంఠం ఆస్తులపై సర్కారు కీలక నిర్ణయం

0
412

గ్రామ కంఠం భూముల విషయంలో ఎపి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామకంఠంలో ఉండే స్థలాలు, ఇండ్లకు సర్వే నెంబర్లు ఉండవు. ఆస్తుల సరిహద్దులు కూడా సరిగా ఉండవు. ఎవరి ప్రాపర్టీ హద్దులేంటి అన్నది సమగ్రంగా ఉండదు. తరచూ వివాదాలు జరుగుతుంటాయి. అంతేకాకుండా కంఠంలో ఉండే ప్రపార్టీలకు ఎలాంటి ధృవీకరణ పత్రాలు ఉండవు. ఆపతి సాపతి వస్తే ఆ ప్రాపర్టీని తనఖా పెట్టి అప్పు తీసుకుందామంటే పత్రాలు సమగ్రంగా ఉండవు. ఉన్నా అప్పు సప్పు పుట్టదు. దీంతో ఆంధ్రా సర్కారు గ్రామకంఠం భూములకు గుర్తింపునిచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

గ్రామ కంఠం భూముల్లో ప్రజలకు సంబంధించిన ఇళ్లు. ఖాళీ స్థలాలకు ఇప్పటిదాకా అధికారిక ధ్రువీకరణ పత్రా ల్లేవు. దీన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయా గ్రామాల్లోని గ్రామకంఠంలో ఆయా ఇళ్లు, ఖాళీ స్థలాలను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. “వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష” పథకంలో భాగంగా ఇప్పటిదాకా 753 గ్రామాల్లో సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా సర్వే పూర్తయ్యిందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే 241 గ్రామాల్లోని ఇళ్లు. ఖాళీ స్థలాలకు మ్యాప్ ల లో మార్కింగ్ చేశారు. వీటిని పంచాయతీరాజ్ శాఖకు సర్వే ఆఫ్ ఇండియా అధికారులు అందజేశారు. పంచాయ తీరాజ్ శాఖ సంబంధిత గ్రామాలకు వీటిని పంపిస్తోంది.

గ్రామ పంచాయతీ సిబ్బంది క్షేత్ర స్థాయిలో వ్యక్తిగతంగా ఒక్కొక్క ఆస్తిని ధ్రువీకరించుకుంటారు. ఇవి కాకుండా క్షేత్ర స్థాయిలోని అధికారులు ఏవైనా ఆస్తులను గుర్తిస్తే.. వాటి వివరాలను మ్యాప్ కు జత చేసి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపిస్తారు. ఈ వివరా లను పరిశీలించి మళ్లీ కొత్త మ్యాప్ లను తయారు చేస్తారు. తుది ప్యూప్ లో గ్రామ పరిధిలోని ఒక్కొక్క ఆస్తికి ప్రత్యేక నంబర్ కేటాయిస్తారు. పంచాయతీ రాజ్ శాఖ ఒక్కొక్క ఆస్తికి.. దాని యజమాని వివరాలతో ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుంది. ఈ పత్రాల్లో ఆ ఆస్తికి సంబంధించిన మ్యాప్ కూడా ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు 16 గ్రామాల పరిధిలో ఆస్తి ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఈ 16 గ్రామాల పరిధిలో ఉన్న 3,170 ఆస్తులకు సంబంధిత యజమాని వివరాలతో పాటు మ్యాప్ లు సిద్ధమయ్యాయని వెల్లడించారు. ఇతర గ్రామాల్లోనూ ఈ ప్రక్రియ వేగంగా జరుగుతోందని చెప్పారు. కృష్ణా జిల్లా బూతుమిల్లి పాడు పరిధిలోని గ్రామ కంఠంలో ఉన్న ఆస్తుల గుర్తింపు ప్రక్రియను పంచాయతీరాజ్ శాఖ కమిషసర్ గిరిజాశంకర్ పరిశీలించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామకంఠంలో ఉండే ప్రాపర్టీ సర్టిఫికెట్ల పంపిణీని సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిసింది. తొలి విడత కింద వంద గ్రామాల్లో 25 వేల ఆస్తులకు సర్టిఫికెట్లు పంపిణీ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.