తెలంగాణలో ఇకపై సర్కారు రియల్ ఎస్టేట్ వెంచర్లు

0
114

తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ దందా చేపట్టబోతున్నది. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు పట్టణాలు, నగరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లను పెద్ద ఎత్తున నెలకొల్పబోతున్నది. పట్టణాలు, నగరాల శివారు ప్రాంతాల్లో ప్రయివేటు భూముల్లో సర్కారు లేఅవుట్లు, వెంచర్లు వేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే హైదరాబాద్ పరిసరాల్లో హెచ్ఎండిఎ అ పనిలో ఉండగా ఇప్పటినుంచి రాష్ట్రమంతా దృష్టి సారించనున్నది.

పట్టణాలు, నగరాల పరిధిలో ల్యాండ్ పూలింగ్ సిస్టం ద్వారా లేఅవుట్ల ను డెవలప్ చేయాలని, ఇందుకోసం ఉన్న అవకాశాలు, విధి విధానాలు రూపొందించాలని మున్సిపల్ అధికారులను రాష్ట్ర కేబినెట్ ఆదేశించింది. మంగళవారం ప్రగతి భవన్ లో సిఎం కేసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు.

హెచ్ఎండిఎ పరిధిలో ప్రస్తుతం అమలులో ఉన్న ల్యాండ్ పూలింగ్ పథకం మాదిరిగానే… పట్టణాల్లో సైతం వెంచర్లు చేపడతారు. తమ భూమిని వెంచర్లుగా డెవలప్ చేయాలని ఆసక్తి ఉన్న భూ యజమానులతో ఆయా అర్బన్ డెవలప్ మెంట్ సంస్థలు అగ్రిమెంట్ చేసుకుంటాయి. ఇందులో భాగంగా నాలా ఛార్జీలతోపాటు ల్యాండ్ యూజ్ మార్పు ఛార్జీలను ఆయా అర్బన్ డెవపల్ మెంట్ సంస్థలే భరించనున్నాయి.

ల్యాండ్ పూలింగ్ పథకం కోసం భూములు ఇచ్చిన వారి రిజిస్ట్రేషన్ ఖర్చులను కూడా పట్టణాభివృద్ధి సంస్థలే చెల్లిస్తాయి. లేఅవుట్ అప్రూవల్స్ అయ్యాక ఆరు నెలల్లోగా కొన్ని ప్లాట్లను భూమి యజమానులకు ఇచ్చి, మరికొన్నింటిని పట్టణాభివృద్ధి సంస్థలు వేలం వేస్తాయి. భూమి ఓనర్లు తమకు కేటాయించిన ప్లాట్లను వారి ఇష్టానుసారం ఉంచుకోవచ్చు. లేదంటే అమ్ముకోవచ్చు.
గతంలో హెచ్ఎండిఎ లేఅవుట్ చేస్తే సగం ప్లాట్లను ల్యాండ్ ఓనర్ కు ఇచ్చి, మిగతా సగం ప్లాట్లను వేలం వేసేది. 2020 జూన్ తర్వాత ఈ విస్తీర్ణ శాతంలో మార్పులు చేసింది సర్కారు. భూ యజమానులకు 60 శాతం, హెచ్ఎండిఎకు 40 శాతం కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హెచ్ఎండిఎ పరిధిలో 500 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ప్రాజెక్టులు కొలువుదీరబోతున్నాయి. డెవలప్ మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ టివిలో దీనికి సంబంధించిన వార్త కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూడొచ్చు.

https://youtu.be/jxDZz_Ok8dM