Hyderabad real estate / రియల్ డబుల్ భూమ్ @కొల్లూరు

0
134

హైదరాబాద్ నగరంలో వెస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కి అత్యంత అనువైన ప్రాంతంగా విరాజిల్లుతున్నది. కొల్లూరు ఏరియాలో రియల్ రంగం వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. భూమి ధరలు కోట్లకు చేరుకున్నాయి. ఇది చాలదన్నట్లు కొల్లూరు ఏరియాలో రియల్ ఎస్టేట్ తారా స్థాయికి చేరే పరిస్థితులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. రియల్ డబుల్ భూమ్ @ కొల్లూరు కథేంటో ఎందుకు డబుల్ స్థాయిలో రియల్ రంగం ఎదగబోతున్నదో వివరాలు చూద్దాం.

హైదరాబాద్ లో మరో ఐటి హబ్ ఏర్పాటుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. కొల్లూరు పరిసరాల్లో 640 ఎకరాలను దీనికోసం గుర్తించింది. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఇక్కడ భూమిని సేకరించబోతున్నది. దీనికోసం ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక ముసాయిదా సిద్ధం చేసింది. ఈ ఐటి హబ్ మనుగడలోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలొస్తాయని అంచనా వేస్తోంది సర్కారు. ఈ మేరకు ఉపాధి అవకాశాలు లభించే చోట రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు 12 కాయలు అన్నట్లుగా మారకుండా ఎలా ఉంటుంది చెప్పండి?. కొల్లూరు పరిసరాలు రియల్ ఎస్టేట్ కు మరింతగా కేరాఫ్ అడ్రస్ కానున్నాయి.

రానున్న రోజుల్లో ఐటి, అనుబంధ రంగాలకు గిరాకీ పెరగనున్న నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ లో మరో ఐటి హబ్ ఏర్పాటుకు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్న కొల్లూరు, ఇదుల్లనాగులపల్లి పరిసరాలు ఇందుకు అనువుగా ఉన్నట్లు గుర్తించింది. భూ సమీకరణ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. కొల్లూరు, ఇదుళ్లనాగులపల్లి తోపాటు శంకర్ పల్లి మండలంలోని కొండకల్ మధ్యలో ఈ ఐటి హబ్ కొలువుదీరనుంది.

ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డుకు 1.3 కిలోమీటర్ల దూరంలో 640 ఎకరాల భూమిని ఎచ్ఎండిఎ గుర్తించింది. హైటెక్ సిటీని తలదన్నేలా ఐటి, ఐటిఇఎస్ కంపెనీలను ఈ హబ్ లో ఏర్పాటు చేయనున్నారు. హెచ్ఎండిఎ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయడమే మిగిలి ఉంది.

వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి ఐటి హబ్ ను పట్టాలెక్కించాలని సర్కారు కసరత్తు చేస్తున్నది. ఈ ఐటి హబ్ ప్రతిపాదనలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత కొల్లూరు, ఈదుళ్లనాగులపల్లి, శంకరపల్లి, కొండకల్ పరిసరాల్లో భూముల ధరలు భారీగా పెరిగిపోతాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ధరలు ఆకాశంలో ఉండగా ఈ ఐటి హబ్ తో మరింతగా పెరిగే చాన్స్ ఉందంటున్నారు. అపార్ట్ మెంట్ ఫ్లాట్స్, విల్లాస్ నిర్మాణానికి కూడా గిరాకీ పెరిగే చాన్స్ ఉందంటున్నారు.