తెలంగాణలో ఇకపై 60 గజాల ప్లాట్స్

0
150

తెలంగాణలో రాష్ట్రంలో కొత్త నిబంధనలను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇకనుంచి పట్టణాలు, నగరాల్లోని లేఅవుట్లు కొత్త రూపును సంతరించుకోనన్నాయి. 60 గజాల్లో చిన్న సైజ్ ప్లాట్లు డిజైన్ చేసేందుకు డెవలపర్లకు తెలంగాణ సర్కారు అనుమతించింది. గతంలో ఈ సైజు 143 గజాలు గా ఉండేది. ఇది ఒకరకంగా చెప్పాలంటే డెవలపర్లకు, పేద ప్రజలకు ఊరనటిచ్చే అంశంగా చెప్పవచ్చు. ఇకపై పేద ప్రజలు కూడా అప్రూవ్డ్ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు సర్కారు వెసుబాట్లు కల్పించినట్లు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త లేఅవుట్ నిబంధనలను రూపొందించి ఆచరణలోకి తీసుకొచ్చింది. జులై 5వ తేదీ నుంచే ఈ నిబంధనలు మనుగడలోకి వస్తాయని తెల్పింది. ఈ నిబంధనలు ప్రకారం జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ పరిధి మినహా మిగిలిన తెలంగాణ రాష్ట్రమంతా విస్తరించిన పట్టణాలు, నగరాలకు వర్తిస్తాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం.

గతంలో ప్లాట్ కనీస విస్తీర్ణం 143 గజాలు ఉండేది. ఇప్పుడు దాన్ని 60 గజాలకు తగ్గించారు. ప్లాట్ కనీస వెడల్పు 20 ఫీట్లు ఉంటే సరిపోతుంది.

జులై 5వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త పురపాలక, టిఎస్ బిపాస్ చట్టం అమలులోకి వచ్చింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

లేఅవుట్లకు ఆన్ లైన్ లో స్వీయ ధృవీకరణ ద్వారా అప్లై చేసుకుంటే ఇకపై అనుమతులు జారీ చేస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని బ్లాక్ లిస్టులో పెడతారు.

ప్రతి లేఅవుట్ లో సోషల్ యూజ్ కోసం అంటే సామాజిక వసతుల కల్పన కోసం కేటాయించే స్థలాన్ని మరో 2.5 శాతం కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది.

సదరు వెంచర్ కు అప్రోచ్ రోడ్డు ఇకపై 60 ఫీట్లు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది ప్రభుత్వం.

ఇకపై 50 హెక్టార్లకు మించిన విస్తీర్ణంలో నెలకొల్పే అవుట్లకు పర్యావరణ అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలి.

మొత్తం ప్లాట్ల విస్తీర్ణంలో 15శాతం స్థలాన్ని మార్టిగేజ్ చేయాలి.

స్వీయ ధృవీకరణ ద్వారా అప్లై చేసుకున్న దరఖాస్తులకు ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ అనుమతి మంజూరు చేస్తుంది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఇందులో ఆర్ అండ్ బి, ఇరిగేషన్, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు, డిస్ట్రిక్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తో పాటు జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన అధికారి సభ్యులుగా ఉంటారు.

దరఖాస్తు వచ్చిన 5 రోజుల్లోగా ఈ కమిటీ పరిశీలిస్తుంది. 10 ఎకరాల లోపు విస్తీర్ణం వెంచర్ అయితే మున్సపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు 10 ఎకరాలు దాటితే డిటిసిపి పరిధిలో సాంకేతిక తనిఖీలు చేసి జిల్లా కలెక్టర్ కు 5రోజుల్లోగా నివేదిక ఇస్తారు.

లేఅవుట్ కు టిఎస్ బి పాస్ ద్వారా అప్లై చేసుకున్న 21 రోజుల్లోగా అనుమతి వస్తుంది.

దరఖాస్తు చేసేటప్పుడు డెవలపర్ 10వేల రూపాయల ఫీజు, నిర్దేశించిన సర్టిఫికెట్లు సమర్పించాలి. అప్లికేషన్ పేపర్లో ఏవైనా మిస్ అయితే 10 రోజుల్లోగా డెవలపర్ కు తెలుపుతారు. డెవలపర్ వాటిని 7 రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉంటే వెంటనే అనుమతి ఇస్తారు.

తర్వాత లేఅవుట్ ఫీజును 30 రోజుల్లోగా చెల్లించాలి. అలా చెల్లించకపోతే మరో 30 రోజులు టైం ఇస్తారు. అప్పుడు 10 పర్సెంట్ ఇంట్రెస్ట్ తో చెల్లించాలి.

లే అవుట్ కు మెయిన్ రోడ్డుకు మధ్య అప్రోచ్ రోడ్డు మాత్రం గతంలో 30 ఫీట్లు ఉన్నా అనుమతించేవారు. కానీ ఇప్పుడు దాన్ని 60 ఫీట్లకు పెంచారు. అంటే 18 మీటర్లు ఉండాల్సిందే.

ఒకవేళ ఇప్పుడు 30 ఫీట్లు అప్రోరచర్ రోడ్డు ఉంటే దాన్ని వెడల్పు చేయడానికి సరిపోయేంత భూమిని వదిలిపెట్టాలి.

ఒకవేళ భూమి వదిలిపెట్టే వెసులుబాటు లేకపోతే 30 అడుగులే రోడ్డు ఉంటే ఆ రోడ్డు అభివృద్ధి కోసం వందశాతం అభివృద్ధి ఛార్జీలను ఇంపాక్ట్ ఫీజుగా చెల్లించాలి.

అలా కాకుండా ఒకవేళ సదరు వెంచర్ కు అప్రూవ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్డు 60 ఫీట్లు ఉండి… ఫీల్డులో వాస్తవంగా అంతకంటే తక్కువ ఉంటే మాత్రం రోడ్డు ఇంపాక్ట్ ఫీజు 50శాతం చెల్లించాలి.

ప్రతి లేఅవుట్ లో 10 శాతం తక్కువ కాకుండా స్థలాన్ని ఓపెన్ ప్లేస్ ను ముందుగానే ప్రజావసరాల కోసం మున్సిపల్ శాఖకు అప్పగించాలి. ఇందులో 9 శాతం స్థలాన్ని గ్రీనరీ కోసం కేటాయిస్తారు.

మిగిలిన ఒక శాతం స్థలంలో వాటర్ ట్యాంక్, సెఫ్టిక్ ట్యాంక్, ట్రాన్స్ ఫార్మర్, కామన్ పార్కింగ్ లాంటివాటికి కేటాయిస్తారు.

సామాజిక వసతుల కల్పన కోసం మరో 2.5 శాతం ప్లేస్ ను కేటాయించాలి. దీనిలో ఫార్మసీ, క్లినిక్, స్కూల్, ప్లే స్కూల్, క్రష్, డిస్పెన్సరీ వంటి వాటికి వినియోగించాలి. సంబంధిత 2.5 శాతం ల్యాండ్ ను ఈ అవసరాలకు మాత్రమే వినియోగించేలా లేఅవుట్ యజమాని అమ్ముకునే అవకాశం ఉంటుంది.

50 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో వెంచర్లు వేస్తే స్కూల్, హెల్త్ సెంటర్, కమర్షియల్ స్పేస్ కోసం స్థలాన్ని కేటాయించాలి.

వెంచర్ కు ఎల్.పి. నెంబరు వచ్చిన  రెండేళ్లలోగా డెవలపర్ అన్ని ఎమెనిటీస్ ఏర్పాటు చేయాలి. ప్రత్యేక సందర్భాల్లో మరో ఏడాది వరకు మున్సిపల్ శాఖ గడువు పెంచుతుంది. అయితే అలాంటి సమయంలో లేఅవుట్ అప్రూవల్ ఫీజులో 20 శాతం అదనంగా చెల్లించాలి.

గడువులోగా మౌలిక సదుపాయాలు కల్పించకపోతే మార్టిగేజ్ చేసిన 15శాతం ప్లాట్ల స్థలాలను విక్రయించి కమిషనరే ఆ వెంచర్ లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.