Parenting Skills | సమాజంలో ఉండే ప్రతివారికి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నిర్వహణలో కర్తవ్యాన్ని మరవకూడదు. అప్పుడే కుటుంబం బాగుంటుంది. కుటుంబం వల్ల సమాజం బాగుంటుంది. ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తే కుటుంబం ఎలా పురోభివృద్ధిని సాధిస్తుందో సమాజం కూడా అలా పురోగతిని పొందుతుంది. అపుడే ఆదర్శ సమాజం, ఆదర్శ కుటుంబాలు ఉంటాయి. మనుషులు ఆదర్శవంతులు అవుతారు. మన పూర్వీకులు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు. అంటే ఒక్క మహిళ తన వంతు బాధ్యతను తాను నిర్వర్తిస్తే చాలు ఆ ఇంట్లో ప్రతివారూ తమ తమ బాధ్యతలను నిర్వర్తిస్తారు. అలానే నేడు మహిళలు ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. ఆ ఉద్యోగాలను చేస్తున్న మహిళ కర్తవ్యనిష్ఠ చూసి ఇతరులుకూడా కర్తవ్యాన్ని విస్మరించరు.
Parenting Skills | అయితే కొన్ని ఇళ్లలో కొడుకులకు ఇచ్చిన ప్రాధన్యత కూతుళ్లకు ఇవ్వరు. ఇది కుటుంబ వృద్ధికి భంగం కలిగిస్తుంది. తద్వారా సమాజవృద్ధికి కూడా. అసలు కొడుకులకు ప్రాధాన్యమిచ్చి కూతుర్లను నిర్లక్ష్యం చేయమని ఏ మహానీయుడు ఎప్పుడూ చెప్పలేదు. కాకపోతే కొందరి వక్రబుద్ధి వల్ల జరగరాని అన్యాయాలు ఈ సంఘంలో చోటు చేసుకుంటున్నాయి. కొన్ని వందల సంవత్సరాలు అలాగే కొనసాగాయి. స్త్రీలు విపరీత వివక్షకు గురయ్యారు. సంఘం ఒంటికాలిపై కుంటి నడక నడిచింది. ఇప్పుడు కొడుకులు, కూతుర్ల పట్ల తల్లిదండ్రుల బాధ్యత లేమిటో చూద్దాం.. వారికి అన్నవస్త్రాలను సమకూర్చి పెంచి పోషించాలి. నాణ్యమైన విద్యాబుద్ధులను అందించాలి. వారికి అనారోగ్యమైతే ఔషధాలను, వైద్య చికిత్సను అందించాలి. దగ్గరుండి తగిన సేవలు చేస్తూ ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగించాలి. వారి భయాందోళనలు పారద్రోలాలి.
సంతానానికి యుక్తవయస్సు రాగానే తగిన సంబంధాన్ని చూసి వివాహం చేయాలి. ఏదో ఒక వృత్తిలోనో, వ్యాపారంలోనో స్థిరపడే వరకు అండగా ఉండాలి. కొడుకుల వివాహం విషయంలో కట్న కానుకల కొరకు ఆశించక చదువు, సంస్కారం గల అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేయాలి. తాము సంపాదించిన ఆస్తిని పిల్లలకు వ్యత్యాసాలు చూపకుండా సమానంగా పంచి ఇవ్వాలి. బంధువుల పట్ల, పేదల పట్ల సానుభూతిని తెలపాలి. ఎదుటివారి నుంచి తీసుకోవడం కన్నా ఇతరులకు ఇవ్వడంలోని ఆనందాన్ని పిల్లలకు నేర్పించాలి.