Healthy Relationship | మన ఆలోచనలే అలవాట్లుగా మారతాయి. అవే మన జీవితాన్ని మారుస్తాయి. మరి ఆరోగ్యకరమైన ఆలోచనలను అలవాట్లుగా మార్చుకుంటే వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడిపేయొచ్చు. వివాహ బంధాన్ని ఆనందదాయకం చేసుకోవాంటే మీరు కూడా ఈ మూడు సూత్రాలను అలవాటు చేసుకుని పాటించి చూడండి.
చిరునవ్వుతో పలకరింపు:
ప్రతి రోజూ ఉదయాన్నే గుడ్ మార్నింగ్, ఐ లవ్యూ.. అంటూ ఓ చిరునవ్వుతో మీ భాగస్వామిని పలకరించండి. మీరు చిరునవ్వుతో చెప్పే ఆ మాటలు వారికి రోజంతా గుండెల నిండా సంతోషాన్ని, అంతులేని ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే రాత్రి నిద్రపోయే ముందు వారికి ప్రేమగా గుడ్ నైట్ చెప్పండి. మీ మధ్య ఎన్ని గొడవలున్నా, కలతలున్నా.. వాటన్నింటి కంటే ఎదుటి వారి మీద ప్రేమే ఎక్కువనే విషయాన్ని మీ మాటల్లో, చేతల్లో తెలియజేయండి.
అన్నీ కంప్లైంట్ చేయొద్దు:
మీ భాగస్వామి చేసే పనుల్లో పొరబాట్ల కంటే తను చేసే మంచి పనులపైనే దృష్టి పెట్టండి. ఒకవేళ తనవల్ల పొరబాటు జరిగితే అర్థమయ్యేలా సర్ది చెప్పండి. తను చేసే పనులను సానుకూలంగా చూడండి. భార్యాభర్తలన్నాక చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావడం సహజం. వాటిని పరిష్కరించుకోలేక ఒకరినొకరు దూషించుకోవద్దు. ఇద్దరూ కలసి సంయమనంతో వాటిని తొలగించేలా చూసుకోవాలి. అంతేకానీ, ఒకరి పొరపాట్లు మరొకరు కంప్లైంట్స్ చేసుకోకండి.
సమయం కేటాయించండి:
Healthy Relationship | ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా… ఒకరికొకరు ‘ఎలా ఉన్నావ్? భోజనం అయ్యిందా?’ అంటూ క్షేమసమాచారాలు అడిగి తెలుసుకోవాలి. ఆఫీసు నుంచి వచ్చిన తరువాత ఇద్దరూ కాసేపు కూర్చొని సరదాగా గడపండి. ఆ రోజు ఎలా గడిచిందో అడిగి తెలుసుకోండి. ఆ సమయంలో ప్రేమగా భాగస్వామిని దగ్గరకు తీసుకోండి. మీ ప్రేమపూరిత స్పర్శ వారికి మీరున్నారనే భరోసాను, కొండంత అండను కలిగిస్తుంది. వారు కనిపించిన వెంటనే మీ కళ్లలో కనిపించే మెరుపు వారి మనసును ఆనందంతో విహరించేలా చేస్తుంది. చక్కటి చిరునవ్వు, ఆత్మీయంగా నాలుగు మాటలు, ప్రేమపూర్వక స్పర్శ… ఇవే మీ వివాహ బంధాన్ని మరింత బలోపేతంగా చేస్తాయి.