తెలంగాణ ప్రభుత్వం గత ఏప్రిల్ నెలలో పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీ శాఖలో 614 కానిస్టేబుళ్ల పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎస్సై ఉద్యోగులకు ఆగస్టు 7వ తేదీన పరీక్ష నిర్వహించగా..పరీక్ష ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. తాజగా దీనికి సంబంధించి ప్రాథమిక ‘కీ’ని పోలీసు నియామక మండలి విడుదల చేసింది.
ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’ని www.tslprb.in లో చూడొచ్చని తెలిపింది. ‘కీ’పై అభ్యంతరాలను ఈనెల 15 వరకు స్వీకరిస్తామని పేర్కొంది. ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రంలో ఏకంగా 8 తప్పులు దొర్లినట్టు సమాచారం. మరో 6 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు. ఇంగ్లీష్-తెలుగు వెర్షన్‌లోని ‘ఎ’ బుక్‌లెట్‌లో 43, 111, 146, 173, 180, 184, 195, 199 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి. ఈ నేపథ్యంలో ప్రతి అభ్యర్థికి 8 మార్కులు కలపాలని మండలి ఉన్నతాధికారులు నిర్ణయించారు.