తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..9 రోజులు దర్శనాలు రద్దు!

0
110

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబరు నెలలో వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా 9 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

బ్రహ్మోత్సవాలు జరిగే ఆ తొమ్మిది రోజులు స్వామివారి ప్రత్యేక దర్శనాలు అన్నీ రద్దు చేశారు. కేవలం సర్వ దర్శనం ద్వారానే భక్తులకు అనుమతి ఉంటుందని ప్రకటించారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. సెప్టెంబర్‌ 27న ధ్వజారోహణం సందర్భంగా సీఎం జగన్‌ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. అక్టోబర్ 1న గరుడ సేవ సందర్భంగా ఘాట్‌ రోడ్డులో ద్విచక్రవాహనాలను అనుమతించమని తెలిపారు.

ఇకపోతే బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు కూడా ప్రొటోకాల్‌ ప్రకారమే ఉంటాయని స్పష్టం చేశారు. అంటే సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 6 వరకు కేవలం సర్వదర్శనం గుండానే స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులను గమనించి భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవాలంటూ సూచించారు.