శ్రీవారి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనంలో ధ్యానమందిరం ఏర్పాటుకు త్వరలో భూమిపూజ చేయనున్నట్లు టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి వెల్లడించారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనాన్ని ఆదివారం ఈవో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఉన్న 1. 5 ఎకరాల స్థలం అభివృద్ధి చేయాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించిందన్నారు.
ఇక్కడ ధ్యానమందిరం, ఉద్యానవనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో ఇందుకు సంబంధించి భూమి పూజ నిర్వహించనున్నట్లు ఈవో చెప్పారు. అంతకుముందు ఈవో శ్రీవారి భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీసీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారి ఉత్సవాలు నిర్వహించినట్లు చెప్పారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా రాత్రి 10 నుండి 11 గంటల మధ్య బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారన్నారు. అంతకుముందు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనాన్ని పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్ఇ- 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఇఇ-5 శ్రీ సురేంద్ర రెడ్డి, డిఇశ్రీ రవిశంకర్ రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొని బృందావనాన్ని పరిశీలించారు.