ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పొదిలిలో గాలి, వాన కారణంగా పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పదవ తరగతి రాస్తున్న విద్యార్థుల పరీక్ష కేంద్రాలలో గాలివాన బీభత్సం సృష్టించడంతో విద్యార్థులు నానాతిప్పలు పడ్డారు. గాలివాన బీభత్సానికి పరీక్షా కేంద్రాలు తడిసి ముద్దకావడంతో విద్యుత్ కోత ఏర్పడింది.
దాంతో విద్యార్థులు సరైన వెలుతురు లేక తీవ్ర అవస్థలు పడుతూ పరీక్షలు రాస్తున్నారు. వారితో పాటు ఉపాధ్యాయులు కూడా చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఈ ఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని మండిపడుతున్నారు. అంతరాయం కలిగిన ప్రదేశంలో పరీక్షలు రాసే విద్యార్థులకు అదనపు సమయం ఇవ్వాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు.