దేశంలో ఇప్పుడు వ్యాక్సిన్ ని కరోనాకి సంజీవనిలా చూస్తున్నారు. ఎక్కడైనా కరోనా టీకా వేస్తున్నారు అని తెలిస్తే పదుల కిలోమీటర్లు దూరం అయినా వెళ్లి టీకా వేయించుకుంటున్నారు. ఇలాంటి వేళ అసలు టీకాలు వేస్ట్ చేయద్దని, చాలా జాగ్రత్తగా వాడాలని వేస్టేజ్ లేకుండా చూడాలని కేంద్రం కూడా చెబుతోంది.
కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయి టీకాలు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో 480 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు గడ్డకట్టాయి. బన్స్వారా జిల్లా రఘునాథపుర గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకొచ్చారు. కాని సిబ్బంది వాటిని సరిగ్గా పనిచేయని ఫ్రిజ్ లో పెట్టారు. ఇలా ఫ్రిజ్ పనిచేయని విషయం ఆసుపత్రి సిబ్బందికి తెలిసినా పట్టించుకోలేదు. దీంతో 480 వ్యాక్సిన్లు గడ్డకట్టిపోయాయి. ఇక అవి టీకా వేసేందుకు పనిచేయవని అధికారులు తెలిపారు. దాదాపు 480 మందికి ఇది సంజీవని వంటిది. ఇలా నిర్లక్ష్యంగా ఉండటం పై ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సిబ్బందికి నోటీసులు జారీచేశారు.