నల్లగొండకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆసక్తికర కథనాలు

0
112

తెలంగాణలోని నల్లగొండ జిల్లా పేరు ప్రఖ్యాతలు గాంచింది. ఇంతకీ ఆ జిల్లాకు నల్గొండ పేరు ఎలా వచ్చింది అని మన పూర్వికులు, పెద్ద వారిని అడగగానే రెండు కొండల నడుమ వున్నది కాబట్టి దీనిని నల్లగొండ అనే పేరు వచ్చిందని సాధారణంగా చెప్పే జవాబు. అయితే, ఇది నిజం కాదని, ఈ పేరు వెనుక ఏదో బలమైన చారిత్రిక నేపథ్యం ఉండనే నమ్మకంతో పలు చారిత్రిక పుస్తకాలను చదివాను. ఏ పుస్తకంలోనూ నల్లగొండకు ఆ పేరు ఎలా వచ్చిందో వివరంగా లేదు.

శాసనాల శాస్త్రి గా పేరొందిన బి.ఎన్. శాస్త్రి వెలువరించిన నల్లగొండ జిల్లా సర్వస్వంలో కూడా దీని గురించిన ప్రస్తావన లేదు. అయితే, మిత్రుడు ఆవంచ ప్రమోద్ తన వద్ద నల్లగొండ చరిత్రము అనే పురాతన చిన్న పుస్తకం ఉందని, దానిలో నల్లగొండ పట్టణ చరిత్రను తెలిపే పలు అంశాలు ఉన్నాయని అనడంతో వెంటనే వెళ్లి ఆ పుస్తకాన్ని తెచ్చుకున్నాను. ఆ పుస్తకం రచయిత పేరు తెలిపే మొదటి పేజీ గాని, కవర్ పేజీ కానీ లేవు లోపల కూడా చెదలు పట్టిన స్థితిలో పేజీలు ఊడి ఉన్నాయి. దీనిలో నల్లగొండ పట్టణం గురించి ఉన్న చరిత్రను అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో మరోసారి అందిస్తున్నాను.

7వ శతాబ్దిలోనే నల్లగొండ పట్టణం ఏర్పాటు

నల్లగొండ పట్టణం ఇంచుమించుగా ఏడవ శతాబ్దం ఆరంభంలో నిర్మితమైనది తెలుస్తోంది. అంతకుముందు, ఈ వూరు దక్షిణం దిశలో ఉన్న పర్వతంపై ఒక దుర్గం మాత్రమే ఉండేది. ఈ దుర్గాన్ని (కోట ) ‘దమయంతి’ కి భర్త అయిన ‘నలుడు’ అనే రాజు కట్టించి తనపేరు నలుగొండ (నలుని పర్వతం) అనే పేరు పెట్టాడని ఒక కథ ప్రచారంలో ఉంది. కాల క్రమేణా నల్లగొండగా రూపాంతరం చెందిందని అంటారు. అయితే, దీనికి సరైన, చారిత్రిక ఆధారాలు మాత్రం లేవు.
కాగా, క్రీ.శ.1179 లో కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్ర మహారాజు తన రాజ్యాన్ని విస్తరించారు. వీరి కాలంలో ఉదయరాజు పానగల్లు కట్టించి దానిని కాకతీయుల సామంత రాజ్యంగా చేసాడు.

ఈ ఉదయరాజు కాలంలోనే ఇప్పటి నల్లగొండ భారీ వృక్షం కలిగిన నల్లని గండి (కనుమ) ఉండేదట. నల్లటి గుట్టల మధ్య ఉన్నదట్టమైన అడవులతో, భారీ వృక్షాల నీడలతో నల్లగా కనిపించడం చేత పానగల్లు పరిసర నివాసితులందరూ ‘నల్లగండి’ అని పిలిచేవారట. అయితే, తన పానగల్లు కు సమీపంలో ఈ భయంకర అరణ్యం ఉండుట మంచిది కాదని భావించిన ఉదయరాజు ఈ అడవిని కొట్టించడంతో ఆ స్థలంలో క్రమక్రమంగా ఇళ్ల నిర్మాణం జరిగింది. ఈ నల్లగండిని భాషా పరిణామ క్రమంలో నల్లగొండగా పిలుస్తున్నారని ఒక ప్రచారం వాడుకలో ఉంది. మరో కథనం ప్రకారం, నల్లగొండ పట్టణ అనంతరం, ఆకాలంలో నిరంతరం విరామం లేకుండా వచ్చే శత్రువుల దండయాత్రలనుండి రక్షించుకోవడానికి సమీపంలోని కాపురాలు గుట్ట పై కోట లను నిర్మించుకొని నివాసాలను మార్చుకున్నారని ఒక అభిప్రాయంగా ఉంది. తమ కాపురాలను గుట్ట పైకి మార్చుకున్నందున దానిని కాపురాలు గుట్టగా పేరు వచ్చిందని ఒక ప్రచారం. పరిస్థితులు చక్కబడడంతో 1800 ప్రాంతంలో తిరిగి గుట్టకింద నల్లగొండలో ఇళ్లను నిర్మించుకొని నివాసాలను మార్చారట.

వేప చెట్లకు నిలయం నల్లగొండ పట్టణం

ఇతర పట్టణాలతో పోల్చి చూస్తే నల్లగొండ పట్టణంలో మొదటినుండి పెద్ద సంఖ్యలో వేప చెట్లు అధిక సంఖ్యలో ఉంటాయి. పట్టణంలోని లతీసాబ్ గుట్ట పైకి ఎక్కి చూస్తే, నల్లగొండ పట్టణం అనేక వేపచెట్లతో హరిత సుందరంగా కనిపించేది. అయితే, కాలక్రమేణా రోడ్ల విస్తరణ సందర్బంగా ఈ వేపచెట్లను దాదాపు డేబ్బాయ్ శాతం కొట్టివేశారు. మన రామగిరి నుండి పెద్ద గడియారం వరకు ఎన్నో పెద్ద పెద్ద వేప చెట్లుండేవి. 1880 నుండి జరుగుతున్న గురువారం అంగడి
నల్లగొండ ప్రస్తుత ప్రకాశం బాజార్ సమీపంలోని కృష్ణ టాకీస్ వద్ద ప్రతీ గురువారం అంగడి జరుగుతుంది. ఈ అంగడి (సంత ) 1880 సంవత్సరం నుండే ప్రారంభమైందని తెలుస్తోంది.

వ్యాస రచయిత : కన్నెకంటి వెంకటరమణ, జె.డీ., ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్.
నోట్ : ఈ కథనాలు కేవలం ఒక ప్రాచీన పుస్తకంలో పేర్కొన్నవి మాత్రమే.