నేడు తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నేడు ఉదయం 11.30 గంటలకు ప్రతి ఒక్కరు ఉన్న చోట ఆగి జాతీయగీతాన్ని ఆలపించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పోలీసుశాఖ ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు.
నేడు అన్ని ట్రాఫిక్ జంక్షన్లలో సామూహిక జాతీయ గీతాలాపన కోసం ప్రజలు గుమిగూడే ప్రదేశాలను గుర్తించి, 11.30 గంటలకు ట్రాఫిక్‌ను నిలిపివేయాలని, మైక్‌సిస్టమ్ ద్వారా అలారం మోగించాలని తెలిపారు. ప్రతి ఒకరూ బాధ్యతగా ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని, జాతీయ గీతాలాపన సమయంలో ఎలాంటి శబ్ధాలు లేకుండా, క్రమశిక్షణతో ఆలపించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
జాతీయ గీతాలాపన ముగిసే వరకు వాహనాలన్ని కూడళ్ల వద్ద నిలిపివేయనున్నారు. వాహనదారులతో పాటు ట్రాఫిక్ పోలీసులూ జాతీయగీతాన్ని ఆలపించనున్నారు. సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నియమాలను చెప్పేందుకు ఏర్పాటు చేసిన మైకుల్లోనూ జాతీయ గీతం వినిపించనున్నారు.