ఒక దొంగ పోలీసులకు ఆధారాలు దొరకరాదని తాను దొంగిలించిన బంగారు ఉంగరాలను మింగాడు. తర్వాత డాక్టర్లు ఆ దొంగకు ఆపరేషన్ చేసి 35 గ్రాముల బరువున్న 25 ఉంగరాలను బయటకు తీశారు. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సుళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
సుళ్యలో పాత బస్టాండు వద్ద ఉన్న నగల దుకాణంలో మార్చి నెలాఖరులో ఒక దొంగతనం జరిగింది. ఏడున్నర లక్షల విలువ చేసే 180 గ్రాముల బంగారు ఉంగరాలు, 50వేల రూపాయలు దోచుకెళ్లారు. ఈ కేసులో పోలీసులు తంగచ్చయన్ మ్యాథ్యూ, శిబు అనే ఇద్దరిని ఇటీవల అరెస్టు చేశారు. ఎవరికీ తెలియకుండా శిబు తన వద్ద ఉన్న 35 గ్రాముల బరువైన 25 ఉంగరాలను గుటుక్కున మింగేశాడు. అతనికి కడుపునొప్పి రావడంతో పోలీసులు ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఎక్స్ రే తీయగా కడుపులో బంగారు ఉంగరాలు కనిపించాయి. దీంతో వైద్యులు అతని పొట్ట కోసి 25 చిన్న చిన్న ఉంగరాలను బయటకు తీశారు. ప్రస్తుతం ఆ దొంగ కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.