దీపావళి వెనుక అసలు కథ ఇదే..!

This is the real story behind Diwali ..!

0
96

దీపం జ్ఞానానికి చిహ్నం. సంపదకు ప్రతిరూపం. కనుకనే నిత్యం దీపారాధన చేస్తాం. కాంతులు విరబూసే దివ్య దీపావళిని సమైక్యతకు సంకేతంగా దేశమంతా జరుపుకుంటుంది. ఈరోజు ఇళ్లంతా దీపాలతో ఎంతో అందంగా అలకరించి..లక్ష్మీదేవిని ఆరాధించి.. మిఠాయిలు పంచుతూ ఎంతో అంగరంగ వైభవంగా దీపావళీని జరుపుకుంటారు. మరి దీపావళి రోజు దీపాలు ఎందుకు వెలిగిస్తారు. ఈ పండుగ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దీపాన్ని వెలిగించినా, దర్శించినా పాపాలన్నీ పటాపంచలైపోయి పుణ్యప్రాప్తి చేకూరుతుంది. శుభం కలుగుతుంది. ఆరోగ్య సంపద లభిస్తుంది. శత్రుభావాలు నశిస్తాయి. ఒక్క దీపం వెలిగిస్తేనే ఇంత భాగ్యం చేకూరితే, ఇక దీపాల వరుసే పెడితే – ఆ పుణ్యప్రాప్తికి కొలమానమే ఉండదు. అందుకే విద్యుద్దీపాల కాంతి ఎంత ఉన్నా.. ఎప్పటికీ మన ఇళ్లల్లో దీపారాధన చేస్తూనే ఉంటాం.

దీపం జ్యోతిః పరబ్రహ్మ
దీపం సర్వతమోపహమ్‌
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపాన్నమోస్తుతే

దీపంలో ముఖ్యంగా మూడు రంగులుంటాయి. తెలుపు, నీలం, ఎరుపు. వీటి కలయికతో పసుపు వర్ణం భాసిస్తుంది. తెలుపు సరస్వతికి, నీలం లక్ష్మికి, ఎరుపు దుర్గాదేవికి ప్రతీకలు. కలగలిసిన పసుపు రంగు త్రిమాతల కలయికనే సూచిస్తుంది. ఇవి సత్త్వ రజ స్తమో గుణాలకు రూపాలు. త్రిమాతల ఐక్యరూపమే త్రిగుణాల సంయగ్రూపం. అందుకే నిత్యం దీపారాధన చేయమని వేదాలు ప్రబోధిస్తున్నాయి.

దీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం మరియు భాగవతాలను చదివితే మీకు ఆ కథలు తెలుస్తాయి.

రామాయణం గురించి మీరు వినే ఉంటారు.అయోధ్యకు రాజు అయిన తండ్రి దశరధుని కోరిక మేరకు శ్రీరాముడు, సీతాలక్ష్మణ సమేతుడై పద్నాలుగేళ్ళు అడవిలో నివసించేందుకు వెళతాడు. వనవాసం చేస్తుండగా లంకాధీశుడైన పదితలల రావణాసురుడు సీతను ఎత్తుకు వెళతాడు. ఆ తర్వాత రావణసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆరోజు అమావాస్య అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది.దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాం.

ఇక రెండవ కథగా నరకాసుర సంహారాన్ని తెలుసుకుందాం. ప్రాద్యోషపురానికి రాజు నరకాసురుడు. బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. నరకాసురుని పీడ విరగడవ్వడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగను జరుపుకున్నారు.ఆ పరంపర నేటికీ కొనసాగుతున్నది.

మూడవ కథగా పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మిదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం.మరణాన్ని దరి చేరని అమృతం కోసం దేవ,దానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజు లక్ష్మిదేవి ఉద్భవించింది.సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు.

నాలుగవ కథగా భారతంలోని ఇతివృత్తాన్ని చెప్పుకుందాం.కౌరవులు సాగించిన మాయా జూదంలో ఓడిన పాండవులు పదమూడేళ్ళు వనవాసం ఒక సంవత్సర కాలం అజ్ఞాత వాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు.ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు.