నేడే తొలి ఏకాదశి..ఈరోజు ఏం చేయాలంటే?

0
99

ఆషాఢ శుద్ధ ఏకాదశి- తొలి ఏకాదశి. హైందవులకు ఇది మహా పర్వదినం రోజు. దీన్ని “హరివాసరం” అని.. “శయనైకాదశి” అని పిలుస్తారు. తొలి ఏకాదశి నుంచే సనాతన సంప్రదాయంలో పండుగలు, పర్వదినాల సమాహారం ఆరంభమవుతుంది. మరి ఈరోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

తొలి ఏకాదశి నుంచే సనాతన సంప్రదాయంలో పండుగలు, పర్వదినాల సమాహారం ఆరంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ఉపాసనా కాలమైతే, దక్షిణాయనం దైవారాధన తరుణం. ఉత్సవ సంరంభాలు, దీక్షా విధులు, నియమ పూర్వక విధివిధానాలకు దక్షిణాయనం ఆలవాలం. అలాంటి ధర్మాచరణకు తొలి ఏకాదశి శుభ శ్రీకారం చుడుతుంది.

తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.