సన్యాసులకు రాజకీయాలు ఎందుకు?

0
98

మఠాలు పీఠాలు – ఆశ్రమాలు, స్వామీజీలు – సన్యాసులు,  రాజకీయ నాయకులు – రాజకీయాలు, అపవిత్ర సంబంధాలు!

హైదరాబాదులో నెలకొల్పబడిన “సమతా మూర్తి” చుట్టూ ఓటు బ్యాంకు రాజకీయాలు, శివవైష్ణవుల మధ్య రగడ చూస్తున్నాం. ఈ పూర్వరంగంలో “సన్యాసులకు రాజకీయాలు ఎందుకు? లౌకిక దేశంలో సర్వం మతం మయం!” అన్న అంశంపై మంగళవారం నాడు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షులు నార్నే వెంకటసుబ్బయ్య గారి అధ్యక్షతన జరిగిన సమావేశానికి నన్ను ఆహ్వానించారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన ఆ సమావేశంలో పాల్గొని, మాట్లాడాను. అందులోని ముఖ్యమైన అంశాలు:

1.”సమతా మూర్తి” రామానుజాచార్యులు విగ్రహాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. రాష్ట్రపతి గౌ.శ్రీ రామ్ నాధ్ కోవింద్ గారి చేతుల మీదుగా కాకుండా ప్రధాన మంత్రి మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడంపై కొందరు చేసిన విమర్శ గమనార్హం.

2. రామానుజ విగ్రహం ఏర్పాటుకు మొదటి నుండి అండగా నిలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనకపోగా, తర్వాత కూడా ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్ట లేదు. కారణాలేమై ఉంటాయన్న దానిపై చర్చ జరుగుతున్నది. బిజెపితో రాజకీయ పోరుకు కేసీఆర్ తాజాగా కాలుదువ్వుతున్న సందర్భంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అగ్రనాయకులకు చిన్నజియ్యర్ స్వామి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో కేసీఆర్ గారికి కోపం వచ్చి ఉండవచ్చని, ఫలితంగా తన ఆధ్యాత్మిక గురువుగా భావించిన చిన్నజీయర్ స్వామితో సంబంధాలు చెడి ఉండవచ్చన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

3. మోడీ గారి మంత్రివర్గంలో ఉన్న అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ మొదలు పలువురు బిజెపి అగ్రనేతలు “క్యూ” కట్టి ఆ కేంద్రాన్ని సందర్శించడంతో, అది బిజెపి అడ్డాగా మారిందా! అన్న చర్చకు అవకాశం ఇవ్వబడింది.

4. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే స్వామీజీలు – సన్యాసులు – వారి నిర్వహణలో ఉన్న మఠాలు – పీఠాలు – ఆశ్రమాలు – సంస్థలకు రాజకీయ నాయకుల మధ్య ఉన్న అపవిత్ర బంధం బోధపడుతుంది. సహజ సిద్ధంగా స్వామీజీలు – సన్యాసులు, మఠాలు – పీఠాలు – ఆశ్రమాల వ్యవస్థ బిజెపికి అనుకూలమైన నికార్సైన పక్షమే కదా! వారి తర్వాతే మిగిలిన వారు. అది కేసీఆర్ అయినా! మరొకరైనా!

5.”సమతామూర్తి” కేంద్రాన్ని నెలకొల్పడానికి రు.1000 నుండి 1200 కోట్లు ఖర్చు చేశారన్న అంచనాల వార్తలు ప్రసారమాధ్యమాలలో వచ్చాయి. భూరి విరాళాలిచ్చిన వారిలో ఒక్క “మై హోం” రామేశ్వరరావు గారి పేరొక్కటే బహిర్గతమయ్యింది. మిగిలిన వారి జాబితా బహిర్గతం చేయలేదు. పర్యవసానంగా ఈ కేంద్రం నిర్మాణానికి వెచ్చించిన డబ్బులో అధిక భాగం “నల్లధనం” ఉంటుందని అనుమానాలు రావడం సహజమే కదా!

6. నల్లధనం పీక నులిమెస్తానని, అవినీతిని అరికడతానని ప్రగల్భాలు పలుకుతూ పెద్ద నోట్లను రద్దుచేసి, దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన పెద్దమనిషి మోడీ గారే నల్లధనం, అవినీతి సొమ్ముతో నిర్మించబడిన “సమతా మూర్తి” కేంద్రాన్ని ప్రారంభించడం గమనార్హం. నల్లధనం, అవినీతి డబ్బు కాదని ప్రజలు విశ్వసించాలంటే నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారో, విరాళాలు ఇచ్చిన దాతల జాబితాను జోడించి, బహిర్గతం చేయాలి.

7. చిన్నజీయర్ స్వామి, విశాఖ శారదా పీఠం స్వరూపానందల చుట్టూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు ప్రదక్షణలు చేస్తున్నట్లు? చిన్నజీయర్, స్వరూపానంద స్వామీజీలు పాలకులను, పాలనా వ్యవస్థలను ప్రభావితంచేస్తూ, రాచమర్యాదలు, ప్రయోజనాలు పొందుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.

8. సన్యాసులు, స్వామీజీలు, వారు నిర్వహించే మఠాలు, ఆశ్రమాలు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి చొరబడి, రాజకీయ నాయకులతో, ప్రత్యేకించి అధికారంలో ఉన్న రాజకీయ నాయకులతో నిత్యసంబంధాలు ఏర్పాటు చేసుకొని, పొగడ్తలతో ముంచెత్తడం దేనికి సంకేతం? మతాన్ని, భక్తి విశ్వాసాలను రాజకీయాల్లోకి చొప్పించడం, వ్యాపారమయం చేయడం తీవ్రగర్హనీయం. ఈ దోరణి భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు, ప్రజాస్వామ్య మ్యం – లౌకిక వ్యవస్థకు ప్రమాదకరం. ప్రజలు ఈ పరిణామాలపై దృష్టి సారించి, చైతన్యంతో స్పందించాలి.

సమావేశంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు జంపాకృష్ణ కిషోర్ గారు కూడా పాల్గొని, ప్రసంగించారు.

టి.లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు