టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan).. తన రిటైర్మెంట్ వెనక్కున్న అసలు కారణాన్ని ఎట్టకేలకు వెల్లడించాడు. ఆగస్టు నెలలోనే అంతర్జాతీయంతో సహా దేశవాళీ క్రికెట్‌కు కూడా ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే జాతీయ జట్టులో స్థానం కోసం దేశవాళీ క్రికెట్లో ఆడే ప్రేరణ లేకపోవడం వల్లే ఆటకు వీడ్కోలు పలికానని తాజాగా ధావన్ చెప్పాడు. ‘‘దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని అనుకోలేదు. అందులో ఆడాలన్న ఉత్సాహం కూడా నాకు లేదు. నా కెరీర్ చివరి రెండేళ్లలో అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా ఆడింది లేదు. ఐపీఎల్‌లోనే ఆడాను. మొత్తంగా రెండేళ్లలో చూసుకున్నా నేను ఆడింది చాలా తక్కువ కాలమే’’ అని వివరించాడు శిఖర్.
‘‘ఇక చాలు. చాలా క్రికెట్టే ఆడాను అనుకున్నా. విరామం కావాలని అనిపించింది. ఎక్కవగా క్రికెట్ ఆడకపోవడంతో ఫామ్‌లో కూడా పెద్దగా ఏమీ లేను. నేను నా కెరీర్‌లో సాధించిన దాని పట్ల సంతృప్తికరంగానే ఉన్నా. ప్రపంచకప్ గెలిస్తే బాగుండేది. కానీ మిస్ అయ్యాం. రోహిత్(Rohit Sharma) చాలా గొప్ప కెప్టెన్. భారత్‌కు ప్రపంచకప్ అందించిన కెప్టెన్లలో అతడు కూడా ఒకడు. ప్రపంచకప్ కోసం ఎంతో ఎదురుచూశాం. టైటిల్‌కు చేరువచ్చాం. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌తో లక్ష్యాన్ని అందుకున్నాం’’ అని Shikhar Dhawan చెప్పాడు.