క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్..లెజెండ్స్‌ లీగ్‌ లో ఆడనున్న సెహ్వాగ్, వాట్సన్

0
119

క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాజీ క్రికెటర్ల కోసం నిర్వహించే లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎల్ఎల్‌సీ) టోర్నమెంట్‌ రెండో ఎడిషన్‌ రెడీ అయింది. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఇండియన్ మహారాజ్‌, వరల్డ్‌ జెయింట్స్‌ జట్ల మధ్య ప్రత్యేక మ్యాచ్‌ జరగనుంది.

ఈడెన్‌ గార్డెన్స్‌, జోధ్‌పుర్, లఖ్​నవూ, దిల్లీ, కటక్‌  ఆరు నగరాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తామని లీగ్‌ సహ వ్యవస్థాపకులు, సీఈఓ రామన్‌ రహేజా తెలిపారు. సెప్టెంబర్‌ 16 నుంచి రెండో ఎడిషన్‌ ప్రారంభమవుతుందని వెల్లడించారు. లీగ్‌ దశ మ్యాచ్‌లకు వేదికలను ఖరారు చేయగా.. ప్లేఆఫ్స్‌, ఫైనల్‌కు స్టేడియాలను ఇంకా నిర్ణయించలేదు.

“దిగ్గజాల క్రికెట్‌ను మళ్లీ వీక్షించేందుకు వేచి ఉన్న అభిమానులు, ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి. షెడ్యూల్‌ను విడుదల చేశాం. ఆన్‌లైన్‌లో టికెట్లకు సంబంధించి త్వరలోనే వెల్లడిస్తాం. దాదాపు పది దేశాల నుంచి గుర్తింపు పొందిన టాప్‌ మాజీ ప్లేయర్లు కొత్త ఫార్మాట్‌లో ఆడబోతున్నారు. తప్పకుండా అభిమానులకు నచ్చుతుందని భావిస్తున్నా. అయితే పాకిస్థాన్‌ నుంచి ఎవరినీ తీసుకురావడం లేదు. త్వరలో మరికొందరిని చేరుస్తాం. దిగ్గజ క్రికెటర్లు ఒక్క మ్యాచ్‌ను మిస్‌ కాకుండా ఆడతారు. ఫైనల్‌ మ్యాచ్‌ను డెహ్రాడూన్‌లో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం” అని రామన్ రహేజా వివరించారు. అభిమానులను అలరించేందుకు మరోసారి దిగ్గజ క్రికెటర్లతో కలిసి వస్తున్నామని లీగ్ కమిషనర్‌ రవిశాస్త్రి తెలిపాడు. ఈసారి లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్‌ సింగ్‌, పఠాన్‌ బ్రదర్స్‌, షేన్‌ వాట్సన్‌ తదితరులు పాల్గొంటున్నారు.