భారత అథ్లెట్ చాంపియన్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరోసారి అదరగొట్టాడు. అంతర్జాతీయ వేదికపై మరోసారి దేశ జెండాను సగర్వంగా ఎగరేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించారు. ఫైనల్‌లో 88.17 మీటర్లు బల్లెం విసిరి ఈ ఘనత సాధించాడు. ఫలితంగా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్(World Athletics Championships)లో స్వర్ణం సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదిలా ఉండగా.. నీరజ్ చోప్రా ప్రదర్శన చూసిన బుడాపెస్ట్‌లో ఉండే ఓ మహిళ అతడి ప్రదర్శనకు ఫిదా అయిపోయింది.
భారత జాతీయ జెండాను పట్టుకొని నీరజ్ చోప్రా(Neeraj Chopra) వద్దకు వచ్చింది. త్రివర్ణ పతాకంపై ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరింది. అయితే, నీరజ్ చోప్రా ఆ మహిళ కోరికను సున్నితంగా తిరస్కరించాడు. ‘నేను భారత జాతీయ జెండాపై ఆటోగ్రాఫ్ ఇవ్వను, సంతకం చేయను’ అని సదరు అభిమానికి చెప్పాడు. బదులుగా ఆమె ధరించిన టీషర్ట్‌పై ఆటోగ్రాఫ్ ఇస్తానని చెప్పి.. ఆమెను సంతోష పరిచాడు.