టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్(Rishabh Pant), అక్షర్ పటేల్(Axar Patel) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రాలు ధరించిన వారిద్దరికీ వీఐపీ బ్రేక్ సమయంలో టీటీడీ అధికారులు దర్శనం కల్పించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పంత్, అక్షర్ పటేల్ రాకతో శ్రీవారి ఆలయం ఎదుట కోలాహలం నెలకొంది. వారితో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం ప్రదర్శించారు.
రిషబ్ పంత్(Rishabh Pant) గతేడాది ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రిషబ్.. నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఇక అక్షర్ పటేల్ కూడా ఇటీవల ఆసియా కప్ సందర్భంగా గాయపడ్డాడు. వీరిద్దరు త్వరలోనే కోలుకుని భారత్ జట్టులోకి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక అక్టోబర్ నెలలో శ్రీవారిని 21.75 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. హుండీ కానుకలు ద్వారా రూ.108.65 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. 1.05 కోట్ల లడ్డూలు విక్రయించామని.. 47.14 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించినట్లు చెప్పారు. 8.30 లక్షల మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని పేర్కొన్నారు.