న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ భారత జట్టును తలెత్తుకోలేకుండా చేస్తోంది. సొంత గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌లో దాదాపు 12 ఏళ్లుగా పరాజయం అంటే ఏంటో తెలియని జట్టుగా సాగుతున్న టీమిండియా అత్యంత అవమానకరంగా 3-0 తేడాతో ఓటమి పాలయింది. దీంతో టీమిండియాపై విమర్శల వర్గం కురుస్తోంది. అంతేకాకుండా ఈ ఓటమికి కారణం ఎవరంటే అందరి వేళ్లు రోహిత్ శర్మ వైపే చూస్తున్నాయి. ఈ సిరీస్‌లో రోహిత్ అత్యంత పేలవమైన ప్రదర్శనే భారత్ ఓటమికి ఎక్కువ ఊతమిచ్చిందని అంటున్నారు విమర్శకులు. కొంతకాలంగా టెస్టుల్లో రోహిత్ పూర్తిగా ఫామ్ కోల్పోయి కనిపిస్తున్నాడు. ఇందువల్లే ఈ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే రోహిత్ ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాడు అని టీమిండియా ప్లేయర్ దినేష్ కార్తిక్(Dinesh Karthik) వివరించాడు. అంతేకాకుండా రోహిత్ కు పలు సలహాలు, సూచనలు కూడా చేశాడు.
‘‘టెస్టుల విషయంలో రోహిత్ శర్మ(Rohit Sharma) తన కంఫర్ట్ జోన్‌ను వదిలి బయటకు రావాలి. టెస్ట్ మ్యాచ్‌లలో వీలైనంత వరకు పెద్దపెద్ద షాట్లు ఆడకూడదు. మ్యాచ్‌లో ఇబ్బంది తలెత్తగానే దూకుడుగా ఆడాలని రోహిత్ భావిస్తున్నాడని నేను అనుకుంటున్నా.. టెస్ట్ మ్యాచ్‌లలో ఈ అప్రోచ్ పనిచేయదు. కావాలంటే న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి మూడో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా పెద్ద షాట్ ఆడటానికి ప్రయత్నించే రోహిత్ తన వికెట్ సమర్పించుకుని పెవిలియన్ చేరాడు. కొంచెం ఒత్తిడి పెరిగినా ప్రమాదకరమైన అటాకింగ్ షాట్ ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు రోహిత్. ఈ అప్రోచ్ రోహిత్ కెరీర్ ప్రారంభంలో గొప్ప ఫలితాలిచ్చిందేమో కానీ ఇప్పుడు మాత్రం అతడు తన అప్రోచ్‌ను వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది’’ అని డీకే(Dinesh Karthik) సూచించాడు.