Union Budget: దేశంలో క్రీడలకు ఊతమిచ్చేలా బుధవారం ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కేటాయింపు పై ప్రకటన చేశారు. అథ్లెట్లు ఆసియా క్రీడలు, 2024 ఒలింపిక్స్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్రం క్రీడా రంగానికి శుభవార్త తెలిపింది. 2023 2024 ఆర్ధిక సంవత్సరంలో ఆటల కోసం రూ.3,397, 32 కోట్లు కేటాయించింది. గత ఏడాది కంటే ఇది రూ.723.97 కోట్లు ఎక్కువ. ఖేలో ఇండియా రూ.1,045 కోట్ల నిధులు అందించనున్నారు. గత ఏడాది కంటే రూ.439 కోట్లు ఎక్కువగా కేటాయించిందంటే ఈ పథకానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తోందో అర్ధం చేసుకోవచ్చు. జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కు 2023-24 సంవత్సరానికి రూ.785.43 కోట్లు కేటాయించారు. సాయ్ అథ్లెట్లకు జాతీయ శిబిరాలు నిర్వహించడంతో పాటు వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. అథ్లెట్లకు పరికరాలు ఇవ్వడం, కోచ్ల నియమించడం, క్రీడా మౌలిక సదుపాయాల నిర్వహణ లాంటి ఇతర విధులనూ సాయ్ నిర్వర్తిస్తుంటుంది.