రన్ మెషీన్, కింగ్ ‘విరాట్ కోహ్లీ(Virat Kohli)’ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు(50) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల(49) రికార్డును బ్రేక్ చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేసి ఈ అరుదైన ఘనతను కోహ్లీ సొంతం చేసుకున్నాడు. సచిన్ 49 శతకాలు చేయడానికి 452 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. కోహ్లీ కేవలం 279 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డు అందుకోవడం విశేషం.
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితా..
విరాట్ కోహ్లీ(Virat Kohli) (భారత్) – 50 శతకాలు (279 ఇన్నింగ్స్‌లు)
సచిన్ టెండూల్కర్ (భారత్) – 49 శతకాలు (452 ఇన్నింగ్స్‌లు)
రోహిత్ శర్మ(భారత్) – 31శతకాలు (253 ఇన్నింగ్స్‌లు)
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 30 (365 ఇన్నింగ్స్‌లు)
సనత్ జయసూర్య (శ్రీలంక)- 28 శతకాలు (433 ఇన్నింగ్స్‌లు)
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలోకి దూసుకువచ్చాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ రికార్డును బ్రేక్ చేశాడు. పాంటింగ్ 375 వన్డే మ్యాచుల్లో 365 ఇన్నింగ్స్‌ల్లో 13,704 పరుగులు చేయగా కోహ్లీ 290 వన్డేల్లో 279 ఇన్నింగ్స్‌ల్లో 13,777 పరుగులతో రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 463 వన్డేల్లో 452 ఇన్నింగ్స్‌ల ద్వారా 18,426 పరుగులతో అగ్ర స్థానంలో ఉండగా.. కుమార సంగక్కర 14,234 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.