Hyderabad | ట్రాన్స్జెండర్లుగా వేషం మార్చి భిక్షాటన చేస్తున్న 19మందిని ఉత్తర మండలం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు మొబైల్ఫోన్లు, 11వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర మండలం డీసీపీ చందనా దీప్తి తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి ప్యారడైజ్చౌరస్తా, స్వీకార్ ఉప్కార్ జంక్షన్, జూబ్లీ బస్‌స్టేషన్, సంగీత్ చౌరస్తా వద్ద పోలీసులు ప్యాట్రోలింగ్ చేస్తుండగా కొంతమంది ట్రాన్స్జెండర్లు గుంపులు గుంపులుగా సిగ్నళ్ల వద్ద ఆగిన వాహనదారుల నుంచి డబ్బులు అడుక్కోవటం కంటపడింది.
Hyderabad | దాంతోపాటు మరికొందరు దుకాణందారుల వద్దకు వెళ్లి వాళ్లు డబ్బు ఇచ్చేవరకు అక్కడే నిలబడుతూ వెకిలి చేష్టలకు పాల్పడుతున్నట్టు అగుపించింది. ఈ క్రమంలో 19మందిని అరెస్టు చేసిన పోలీసులు వారిని మహంకాళి, రాంగోపాల్‌పేట, మారేడ్‌పల్లి, గోపాలపురం పోలీస్స్టేషన్లకు తరలించారు. అక్కడ జరిపిన విచారణలో పట్టుబడిన వారు నిజంగా ట్రాన్స్జెండర్లు కాదని వెల్లడైంది. తేలికగా డబ్బు సంపాదించే లక్ష్యంతో ట్రాన్స్జెండర్లుగా వేషం మార్చుకుని భిక్షాటన పేర డబ్బులు గుంజుతున్నట్టు నిందితులు ఒప్పుకొన్నారు. ఈ మేరకు నిందితులపై ఐపీసీ 419, 420, 384, 341, 290 రెడ్‌విత్34 సెక్షన్ల ప్రకారం ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్టు డీసీపీ చందనా దీప్తి తెలిపారు. కోర్టులో హాజరుపరిచి నిందితులను జైలుకు రిమాండ్చేసినట్టు చెప్పారు.