Jayasudha – BJP | ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ బీజేపీ స్పీడు పెంచింది. నేతలంతా విస్తృతంగా జనాల్లో తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ముఖ్యంగా వరదల అంశాన్ని కీలకంగా తీసుకున్నారు. ఈ వరదలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని ప్రజలకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో చేరికలు సైతం జరుపుతున్నారు. తాజాగా.. ఇద్దరు కీలక నేతలు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలు పార్టీలో చేరారు.
ఇదిలా ఉండగా.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జయసుధా బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. శనివారం ఆమె తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి(Kishan Reddy)ని కలిసిన తాజా రాజకీయాలపై చర్చించారు. ఈ క్రమంలోనే బీజేపీలో చేరికపై మనసులో మాట బయటపెట్టినట్లు తెలుస్తోంది. కాగా, జయసుధా(Jayasudha) బీజేపీలో చేరితే సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంతేగాక, ఇటీవల బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్(Eatala Rajender) సైతం ఆమెను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో జయసుధా కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.