ప్రజా భవన్(Praja Bhavan) వద్ద గురువారం రాత్రి ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రజా భవన్ ముందు ఓ ఆటో డ్రైవర్ తన ఆటోని తగలబెట్టిన ఘటన సంచలనం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు డ్రైవర్ ని పక్కకి లాగేశారు. దీంతో అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ అప్పటికే ఆటో చాలా వరకు కాలిపోయింది. మంటల్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో ఒకటైన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆరోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలలో ఎక్కువగా ప్రయనించేది మహిళలే. ఇప్పుడు వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల గిరాకీ తగ్గిపోయిందని వాపోతున్నారు. కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందని బాధపడుతున్నారు. ఆటో EMI లు కూడా కట్టలేని పరిస్థితి నెలకొందని గోడు పెట్టుకుంటున్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగించే తమ పొట్ట కొట్టొద్దని, పథకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి భరోసా రాకపోవడంతో ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఆటో డ్రైవర్లు బలవన్మరణానికి కూడా పాల్పడ్డారు. ఇక ఈ క్రమంలోనే ప్రభుత్వంపై విసుగు చెందిన ఓ ఆటో డ్రైవర్ తన ఆటోని ప్రజా భవన్(Praja Bhavan) ఎదుట తగలబెట్టుకున్నాడు.