Rakshitha | వరంగల్‌లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యువకుడి వేధింపులు తాళలేక ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భూపాలపల్లికి చెందిన రక్షిత అనే యువతి నర్సంపేటలో బీటెక్ చదువుతోంది. అక్కడే కాలేజీ హాస్టల్‌లో ఉంటోంది. అయితే, భూపాలపల్లిలో పదో తరగతి చదివే రోజుల్లోనే రక్షితకు రాహుల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో రాహుల్ రక్షితను కొన్నేళ్లుగా వేధిస్తున్నాడు. ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసేవాడు. చివరకు తల్లిదండ్రుల సాయంతో రక్షిత పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రాహుల్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అతడిలో మార్పు రాలేదు. ఆ తర్వాత రక్షితను హాస్టల్‌లో వద్దని, రామన్నపేటలోని తన సోదరుడు ఇంటికి పంపించిన తండ్రి శంకర్ కాంట్రాక్ట్ పనుల నిమిత్తం జార్ఖండ్‌కు వెళ్లారు. బాబాయి ఇంట్లో ఉంటున్న రక్షిత(Rakshitha) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాహుల్ వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ తల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.