Bandi Sanjay fires on CM KCR and his family: ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ దిల్వార్పూర్ మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోని దివ్యాంగులతో మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ, స్కూల్స్‌లో ఏ సౌకర్యాలు ఉండవు కానీ, బెల్ట్ షాపులు మాత్రం బోలెడు ఉన్నాయని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో ఆకలి చావులు పెరిగిపోయాయనీ.. స్వర్ణకారుల ఆకలి చావులు, పేదోళ్ల ఉసురు ఊరికే పోతదా అని విమర్శించారు. కేసీఆర్ బిడ్డకు సీబీఐ నోటీసులు ఇస్తే.. మనం పోరాటాలు చేయాలా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడదామని బండి సంజయ్ పిలుపునిచ్చారు. తెలంగాణ తరహాలో మరొక మహోద్యమానికి సిద్ధం కావాలని సూచించారు. ఫాంహౌస్‌లో సాగు చేసిన కేసీఆర్.. కోటీశ్వరుడు ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఆరుగాలం పండించిన రైతులు బికారీలు ఎందుకు అవుతున్నారని నిలదీశారు. రైతు బంధు ఇచ్చి.. అన్ని సబ్సీడీలను బంద్ చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చినా ఒరిగిందేమిటని బండి సంజయ్ (Bandi Sanjay) నిలదీశారు.