కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఘాటుగా స్పందించారు. తాను లీగల్ నోటీసులకు భయపడే వ్యక్తిని కాదని, అయినా రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసులు ఇవ్వడం ఏంటని ఎద్దేవా చేశారు. రాజకీయం చేయడం చేతకానోల్లే విమర్శలకు కూడా లీగల్ నోటీసులు ఇస్తారంటూ చురకలంటించారు. అంతేకాకుండా తాను అన్న మాటల్లో తప్పేమీ లేదని, వ్యక్తిగతంగా తనపై ఆరోపణలు చేసిందుకే తాను కూడా ఎదురు ఆరోపణలు చేశానని బండి సంజయ్ చేశారు. అయితే ‘కేటీఆర్(KTR) డ్రగ్స్ తీసుకుంటాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ కూడా చేయించాడు’ అంటూ బండి సంజయ్ చేసిన ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి.
ఇదే అసలు కారణం
గ్రూప్-1 పరీక్ష ఆందోళన దగ్గర మొదలైంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న నిరసనలో బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. అప్పుడు బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 మెయిన్స్‌పై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి.. బండిసంజయ్‌ని పిలిచారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. బండి సంజయ్‌ని ఉద్దేశించి పలు ఆరోపణలు చేశారు. ‘చదువులేని బండి సంజయ్‌ని గ్రూప్-1 పై చర్చలకు పిలిస్తే ఏం లాభం. రేవంత్(Revanth Reddy), బండి(Bandi Sanjay) కలిసి డ్రామాలు చేస్తున్నారు’ అంటూ కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. దీనిపై ఆగ్రహించిన బండి సంజయ్.. ముల్లును ముల్లుతోనే తీయాలన్న తీరులో కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారని, ఫోన్ ట్యాపింగ్ కూడా చేయించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అది కాస్తా ఇప్పుడు లీగల్ నోటీసుల వరకు వెళ్లింది. ఇదిలా ఉంటే కేటీఆర్ నోటీసులకు బండి సంజయ్ తరపు న్యాయవాదులు 15 అంశాలతో కూడా నోటీసులను అందించారు.